సిటీబ్యూరో/మెహిదీపట్నం/ముషీరాబాద్/మలక్‌పేట/కార్వాన్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హజ్‌యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు బస్సు ప్రమాదానికి గురై 45 మంది మృతి చెందడంతో ఒక్కసారిగా నగర వాసులను ఉలిక్కిపడ్డారు. వరుసగా హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వార్తలు వినాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందిన విషయం అందరిని కలిచి వేసింది.
అలాగే నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన 19 మంది, బోరబండ, మూసారాంబాగ్, ఫాతిమానగర్, ఫరూఖ్‌నగర్, రాజేంద్రనగర్, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. సోమవారం తెల్లవారుతుండగానే వారి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఈ దుర్వార్త చెవిలో పడడంతో ఆయా కుటుంబాలతో పాటు నగర వ్యాప్తంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈ నెల 9న నగరంలోని ఆయా ప్రాంతాలకు చెందిన 54 మంది అల్ మక్కా ట్రావెల్స్ (16), హఫ్సా ట్రావెల్స్ (5), బాబుల్ హర్మైన్ (21),మహ్మద్ బైయిజాన్(4)తో పాటు మరో 8 మంది 9వ తేదీన మెహిదీపట్నంలోని ైప్లెయ్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ ద్వారా హజ్‌యాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 46 మంది ప్రమాదానికి గురికాగా ఒక్కరు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, మిగతా 8 మంది బస్సులో ప్రయాణం చేయకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో విద్యానగర్‌కు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మందితో పాటు కార్వాన్ నియోజకవర్గం లంగర్‌హౌస్ మొఘల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, ఐజాన్ అహ్మద్,హమ్దాన్ అహ్మద్ ,హుమెరా నజ్నీన్,సబీహా సుల్తానా,టోలిచౌకి మెరాజ్ కాలనీకి చెందిన షోయబుర్ రహ్మన్,రయీస్ బేగంలు ఉండగా నాంపల్లి నియోజకవర్గం ఆసినగర్ కిషన్‌నగర్‌కు చెందిన ఫర్హీన్ బేగం,మహ్మద్ మంజూర్,జహీన్ బేగం,టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన షెహనాజ్ బేగం,షౌకత్ బేగం,మహ్మద్ మౌలానా,మహ్మద్ అలీ,గౌసియా బేగం,అబ్దుల్ షోయబ్ మహ్మద్,నటరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ ఖదీర్ మహ్మద్,ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌కు చెందిన సారామహమూద్ అల్ అమౌది,షహెజాన్ బేగం తదితరులు ఉన్నారు.
సమాచారం అందుకున్న కార్వాన్ ఎమ్మెల్యే మహ్మద్ కౌసర్ మొహినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మాజీద్ హుస్సేన్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆయా కుటుంబాలకు కావాల్సిన సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని సూచించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లి నగర వాసులు రోడ్డు ప్రమాదంలో సజీవదహనమయ్యారనే సమాచారంతో సోమవారం ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
అసీఫ్‌నగర్, మురాద్‌నగర్, జిర్రా, నటరాజన్నగర్, లంగర్‌హౌస్, మెఘల్నగర్, మెరాజ్ కాలనీలు, అసీఫ్‌నగర్, బోరబండ, మూసారాంబాగ్, ఫరూఖ్‌నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. మూసారాంబాగ్‌కు చెందిన తల్లీ, కూతుళ్లు మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది. అమీనాబేగం, ఆమె కూతురు ఫాతిమాలు రాంనగర్లో ఉంటున్న బందువులతో కలిసి ఉమ్రాకు వెళ్లి ప్రమాదానికి గురుయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న వారి బంధువులు మూసారాంబాగ్‌లోని ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యానగర్‌లో ఒకే కుటుంబానికి, ఇద్దరు తల్లీకూతుళ్లకు బంధుత్వం ఉండడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాన్ని మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల పరామర్శించారు. అంత్యక్రియల కోసం మృతుల దగ్గరి బంధువుల్లో ముగ్గురిని సొంత ఖర్చులతో సౌదీకి పంపిస్తానని బలాల వారికి భరోసా ఇచ్చారు.

విద్యానగర్‌లో విషాదం..
విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మృత్యువాత పడడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. అందరూ బస్సులో నిద్రలో ఉండగా ప్రమాదం చోటుచేసుకుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సజీవదహనమయ్యారు. రిటైర్ట్ రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్(70) తన భార్య అత్తర్ బేగం(60), కూతుళ్లు, కూమారులు, మనువలతో కలిసి మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ దుర్గటనలో నజీరుద్దీన్‌తో పాటు అతడి కొడుకు సల్ల్లావుద్దీన్(38), అతడి భార్య ఫారానా సుల్తానా(37), అమెరికాలో ఉండే పెద్ద కుమారుడి భార్య సనా సుల్తానా(35), ముగ్గురు బిడ్డలు అమినాబేగం(35), రిజ్వాన్ బేగం(37), షమీనాబేగం(39), అక్తర్ బేగం(63), మరియం ఫాతిమా(6), మేరిశ్ ఫాతిమా(10), మహ్మద్ షాజిన్(2), రైదా తజిమ్(10), సల్లాఉద్దీన్ షేక్(42), షేక్ దైనుద్దీన్(12), తసిమా తహరిన్(3), ఉజారుద్దీన్ షేక్(3), హనీఫ్, అజర్ ఉన్నారు.
ఈ ప్రమాద విషయం తెలియగానే విద్యానగర్ మార్స్ భవన్ సమీపంలోని నసీరుద్దీన్ నివాసానికి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నసీరుద్దీన్ అందరితో చనువుగా ఉండే వారని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు అందరూ స్థానిక ప్రజలతో బాగా మాట్లాడే వాళ్లని చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామంటూ స్థానికుఉల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కరే ఆ కుటుంబంలో మిగిలాడు. అతడు అమెరికా నుంచి రావడానికి వీలుకాక పోవడంతో ఉమ్రా యాత్రకు రాలేకపోయారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ముషీరాబాద్, నవంబర్ 17: సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నజీరుద్దీన్ కుటుంబ సభ్యులను సోమవారం రాత్రి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన బాధిత కుంటుబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు సురేందర్, మహ్మద్ ఖదీర్, అబ్బు ఉన్నారు.