సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం అనగానే తరచూ కురిసే వర్షాలు.. అప్పుడప్పుడు కుండపోత. కానీ గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత ఏడాది వరకు భారీ వర్షాలు నమోదుకాగా.. ఈ ఏడాది మాత్రం విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నైరుతి రాక ఆరంభంలోనే ప్రతికూల పరిస్థితులు నెలకొనగా.. ఆ తర్వాత 25 రోజులపాటు వర్షాభావం ఎదురైంది. ఆపై ఓ వారంపాటు భారీ వర్షాలు నమోదయ్యాయి. తదుపరి ఎండా కాలాన్ని తలపించే ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. క్రమంగా గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తున్నది. దీంతో మొన్నటివరకు ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా.. కేవలం రెండు రోజుల వర్షంతో సాధారణాన్ని మించిపోయింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజా సీజన్లో (జూన్-సెప్టెంబరు 5వ తేదీ) ఇప్పటి వరకు 21 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా రికార్డు అయ్యింది. కానీ లోతుగా విశ్లేషిస్తే.. సుమారు వంద రోజుల్లో పట్టుమని పది రోజుల్లోనే వర్షం పడింది తప్ప మిగిలిన అన్ని రోజులూ ‘ఇది వర్షాకాలమేనా?’ అనే సందేహాన్ని కలిగించాయి.
తక్కువ రోజులు.. ఎక్కువ వర్షం!
చినుకు జాడ అనేది చిత్రంగా తయారైంది. తక్కువ రోజులు.. అందునా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం! ఇదీ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన భారీ మార్పులకు నిదర్శనంగా కనిపిస్తుంది. 2023-24 నీటి సంవత్సరం మొదలై సుమారు వంద రోజులు కావస్తున్నది. జూన్ 1వ తేదీ నుంచి వర్షాకాలం ప్రారంభమైందంటే.. వారం అటు ఇటుగా వర్షాలు మొదలయ్యేవి. కానీ ఈ ఏడాది మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణ పరిస్థితులు మునుపటికి చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అంటే మంగళవారం నాటికి గ్రేటర్ పరిధిలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 488.3 మిల్లీమీటర్లు. వాస్తవంగా నమోదైన వర్షపాతం 592.5 మిలీమీటర్లు. అంటే సాధారణం కంటే 21 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. జిల్లాల వారీగా తీసుకున్నా.. హైదరాబాద్ జిల్లాలో సాధారణం కంటే 18 శాతం, రంగారెడ్డి పరిధిలో 26 శాతం, మేడ్చల్ జిల్లాలో ఏకంగా 32 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంకెలపరంగా వర్షాలు సంతృప్తికరంగానే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవికంగా వర్షాలు కురిసిన తీరు అనేది విచిత్రంగా, ఒకవిధంగా ఆందోళనకరంగా ఉన్నాయి.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సీజన్లో నమోదైన వర్షపాతం వివరాలను వారాలవారీగా పరిశీలిస్తే.. ఒకవిధంగా ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి మూడు వారాల పాటు తీవ్ర వర్షాభావం నెలకొంది. మూడో వారంలోనైతే హైదరాబాద్ జిల్లాలో చుక్కంటే చుక్క వర్షం (100 శాతం లోటు) కూడా లేదు. రంగారెడ్డి, మేడ్చల్ల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. మూడు జిల్లాల్లో మూడు వారాల పాటు సాధారణం కంటే చాలా తక్కువ వర్షం కురిసింది. కానీ నాలుగో వారంతో పాటు జూలై మొదటి వారంలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. అంటే వారం, పది రోజుల పాటు కుండపోత వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో జూన్ నాలుగో వారంలో హైదరాబాద్ పరిధిలో సాధారణం కంటే 168శాతం ఎక్కువ, రంగారెడ్డిలో 213శాతం, మేడ్చల్లో 190 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. జూలై మొదటి వారంలో కూడా హైదరాబాద్లో 60 శాతం ఎక్కువ, రంగారెడ్డిలో 75 శాతం ఎక్కువ వర్షపాతం కురువగా.. మేడ్చల్లో 16 శాతం మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మరో రెండు వారాల పాటు మళ్లీ వర్షాభావం నెలకొని.. జూలై నాలుగో వారంలో కుండపోతగా వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, మేడ్చల్లోనైతే ఆ వారంలో కురువాల్సిన సాధారణ వర్షపాతం కంటే రమారమి 350 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అనంతరం ఆగస్టు ఒకటి, రెండు తేదీల్లో కూడా భారీగానే వర్షాలు కురిశాయి. ఆ రెండు రోజుల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే హైదరాబాద్లో 148 శాతం ఎక్కువ, మేడ్చల్లో 250 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది.
తీవ్ర ఉక్కపోతతో తల్లడిల్లిన నగరం
వర్షాకాలంలో కురిస్తే వర్షం లేకపోతే కనీసం వాతావరణం చల్లగానైనా ఉంటుంది. కానీ గత ఆగస్టు నెల ఎండా కాలాన్ని మించిన ఉక్కపోతతో నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మే నెలలో కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదైందంటే వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అనూహ్యంగా గత రెండు రోజులుగా మళ్లీ కుండపోత మొదలైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం లోగానే మేడ్చల్ జిల్లాలో 8.16 సెంటీమీటర్లు, హైదరాబాద్ జిల్లాలో ఎనిమిది సెంటీ మీటర్లు, రంగారెడ్డిలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా కేవలం రోజుల వ్యవధిలోనే వారం, నెలసరి సాధారణ వర్షపాతం నమోదవుతుండటం.. మిగిలిన రోజుల్లో చుక్క వాన లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.