సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో చెదురు, ముదురు ఘటనల మినహా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల పాటు కొనసాగాయి. ఆదివారం ఉదయం కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ ..పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతో క్రేన్ల వద్ద జాప్యం నెలకొనడంతో వాహనాలు బారులు తీరాయి. వందల సంఖ్యలో ట్యాంక్‌బండ్ వైపు సాగడంతో సాయంత్రం కల్లా పీవీ మార్గ్ వైపు వాహనాలు నెమ్మదిగా సాగాయి. రెండు రోజుల పాటు సాగిన నిమజ్జన ఘట్టంలో గ్రేటర్ వ్యాప్తంగా 2 లక్షల 70 వేల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు.
ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 23వేల గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా కమిషనర్ అభినందించారు. పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ 15వేల మంది సిబ్బంది 24 7 క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టులో విధులు నిర్వర్తించడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదన్నారు. 72 కృత్రిమ కొలనులతో ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా, భక్తులు స్థానికంగానే నిమజ్జనమయ్యేలా చూడగలిగామని చెప్పారు.
కాగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన జీహెచ్ఎంసీ అధికారులు,సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ ,సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అభినందనలు తెలిపారు. మహా నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం, ప్రభుత్వ శాఖలు చేసిన ఏర్పాట్లను, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా క్రియాశీలంగా వ్యవహరించిందని ఇరువురు కొనియాడారు.
శోభాయాత్రలో భక్తులు చల్లిన కాగితపు పూలు, సీఓ2 యంత్రాలు విసిరిన పేపర్ కాగితాలు రోడ్లపై కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వీటిని పారిశుధ్య కార్మికులు రాత్రి, పగలు అని తేడా లేకుండా తొలగించడంలో విశేషంగా కృషి చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సేవలను మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా ప్రశసించారు. ఇప్పటి వరకూ 11 వేల అధిక టన్నుల వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపామని చెప్పారు.
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర దాదాపు 40గంటల పాటు సాగిందని, ఈసారి కొన్ని విగ్రహాల ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉండడం వల్ల శోభాయాత్ర కొంత ఆలస్యమైందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గణేశ్ నిమజ్జనం ముగింపు సందర్భంగా ఆదివారం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మీడియాతో కమిషనర్ మాట్లాడారు. గణేశ్ ఉత్సవాల మూడోరోజు నుంచి 11వ రోజు వరకు మొత్తం 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారని, ఇందులో 1.20 లక్షల విగ్రహాలు బేబీ పాండ్స్, ఇతర చిన్న చెరువుల్లో నిమజ్జనమయ్యాయని వారు పేర్కొన్నట్లు తెలిపారు. పోలీసు శాఖ వారి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా హైదరాబాద్ సిటీలో 12030 విగ్రహాలు నమోదయ్యాయని, ఇందులో ప్రధాన నిమజ్జనానికి ముందురోజుల్లో 7,330 విగ్రహాలు నిమజ్జనం చేశారని, మిగతా 4,700 ప్రధాన నిమజ్జన కార్యక్రమంలో చేశారని తెలిపారు.
నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులు రెండురోజులు నిద్రలేకుండా పనిచేశారని, 9 డ్రోన్లు, 35 హైరైజ్డ్ భవనాలపై కెమెరాలను ఉపయోగించి నిఘా పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు తమకు నిమజ్జన వివరాలు, పరిస్థితులను అంచనా వేయగలిగామని ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సహకారంతో నిమజ్జనం ముందుగానే పూర్తిచేయగలిగామని, సెంట్రల్ జోన్ పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీఏ, హెచ్ఎండీఏ వంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయంతో నిమజ్జనం విజయవంతమైందని ఆనంద్ పేర్కొన్నారు. నిమజ్జన ఊరేగింపులో చిన్నపాటి గొడవలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 170 మందిని, పిక్ పాకెటింగ్ కేసుల్లో మరికొందరిని పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. టీజీఐసీసీసీ మల్టీ ఏజెన్సీ వార్ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ, సమస్యలను పరిష్కరించి నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులకు సహకరించారని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
కేరింతలు, నృత్యాలు, ఆటపాటలతో పాటు గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్‌బండ్ మారుమోగింది. హైదరాబాద్‌లో రెండురోజులపాటు అంటే సుమారుగా 40 గంటల నాటు చిన్న పెద్ద విగ్రహాల నిమజ్జనం ఏకధాటిగా కొనసాగింది. శుక్రవారం సాయంత్రం మొదలైన నిమజ్జన సందడి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగింది. హుస్సేన్‌సాగర్ వద్దకు శనివారం రాత్రి పెద్ద ఎత్తున చేరుకున్న గణనాథుల నిమజ్జన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పట్టిందని, విగ్రహాలు ఎత్తు ఊహించినదాని కంటే ఎక్కువగా ఉండడంతో ఆలస్యమైందని పోలీసులు చెప్పారు. గత సంవత్సరం కంటే ఈసారి విగ్రహాలు ఎక్కువగా ప్రతిష్ఠించినట్లు అధికారులు చెప్పారు. నిమజ్జనోత్సవంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రతీ అణువు రికార్డయ్యేలా పోలీసులు అధునాతన సాంకేతికత కలిగిన కెమెరాలను ఉపయోగించారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో విగ్రహాలను త్వరత్వరగా నిమజ్జనం చేసిన నిర్వాహకులు సాయంత్రం ఐదుగంటలలోగా వెనుదిరిగారు.
ట్యాంక్‌బండ్‌పై గణేశ మండలి నిర్వాహకులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. సెక్రటరియేట్ మీదుగా వస్తున్న ఓ గణేశ మండలి నిర్వాహకులు కేసీఆర్‌కు సంబంధించిన పాటలతో వస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పాటలు ఎందుకు పెడుతున్నారంటూ ఆపేయాలని, లేకుంటే డీజే ఇన్స్ట్రుమెంట్ సీజ్ చేస్తామని బెదిరించారు. వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని లాఠీలతో కొట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. నిమజ్జనం చివరి దశలో ఉండగా పోలీసులు తాము సక్సెసయ్యామంటూ డీజేలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి అదే సమయంలో తాము డీజే పెట్టుకుంటే తప్పేంటంటూ పోలీసులను నిర్వాహకులు ప్రశ్నించారు.