దుండిగల్, డిసెంబర్ 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ-హబ్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌లను ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్‌లోని అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీఫ్) ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో సోమవారం జరిగిన యువ పారిశ్రామికవేత్తల నూతన ఆవిష్కరణల కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చెరువులో గుర్రపు డెక్క, చెత్తను తొలగించడానికి నూతన ఆవిష్కర్తలు ప్రభావతి, ఆమె కుమారుడు మోహన్‌రెడ్డి రూపొందించిన ‘విహంతరి రోబోటెక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్’తో పాటు ఎలీఫ్ వీ-హబ్, ప్రీ ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ 2.0, టాక్టాప్-22 హ్యాకథాన్, డిజ్ ఎలెక్-22, ఎలక్ట్రానిక్ వర్క్‌షాప్, ట్రాన్స్‌సెండ్ బయోటెక్ హ్యాకథాన్-22కు సంబంధించిన ఫ్లాగ్‌షిప్‌లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ విద్యార్థి దశ నుండే వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలకు వీలుగా యూనివర్శిటీలు, ఇండస్ట్రీల మధ్య గ్యాప్‌ను పూర్తి చేయడానికి యూనివర్శిటీల వీసీలతో సెమినార్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
పాఠశాల స్థాయి నుంచి నిర్వహిస్తున్న సైన్స్పెయిర్లు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. సమస్యల నుండే వ్యాపారవేత్తలు పుట్టుకువస్తారని, సమాజానికి ఉపయోగపడే మరిన్ని ఆవిష్కరణలతో యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యకు సర్టిఫికెట్లు కొలమానం కారాదని, విద్యార్థులు తామెమిటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన టీ-హబ్‌తో నూతన ఇన్నోవేషన్లకు ఆస్కారం ఏర్పడిందని, దీంతో ఎందరో యువ పారిశ్రామికవేత్తలు అనేక మందికి తమ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. సంస్థల్లో మహిళలతో పాటు పురుషులను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లడం అభినందనీయమని అన్నారు. నూతన ఆవిష్కరణలు, వాణిజ్యీకరణ, ఉద్యోగ కల్పన, ఇంక్యూబేటర్ల రూపకల్పనలో ఎలీఫ్ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అనంతరం నూతన ఆవిష్కరణలు చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలీఫ్ సీఈవో రమాదేవి, సభ్యులు, వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.