సిటీబ్యూరో, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : ఆహ్లాదకర వాతావరణంలో ఎస్టీపీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం 31 చోట్ల చేపడుతున్న ఎస్టీపీల్లో నూతన ఒరవడికి జలమండలి శ్రీకారం చుట్టింది. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకుగానూ అధునాతన సాంకేతికను వినియోగిస్తూ స్థానికులకు పూర్తి భరోసా ఇచ్చేలా ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్తులోనూ ఎస్టీపీల కట్టడానికి ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
నగరంలో నూతనంగా నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నుంచి దుర్వాసన రాకుండా కట్టడి చేసేందుకుగానూ జలమండలి కసరత్తు చేస్తున్నది. ఇందుకు గానూ అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను వినియోగించుకునేందుకు అడుగులు వేస్తున్నది. ఇందుకోసం దేశంలోని వివిధ సంస్థలు రూపొందించిన సాంకేతికతను అధ్యయనం చేస్తున్నది. నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా సుమారు రూ.3,800 కోట్ల వ్యయంతో జలమండలి చేపట్టిన 31 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎంఎల్ డీల(మిలియన్ లీటర్ పర్ డే) మురుగు నీరుశుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను(ఎస్టీపీ) జలమండలి నిర్మిస్తున్నది. ఈ ఎస్టీపీలు దాదాపుగా జనావాసాలకు చేరువగానే ఉన్నాయి. దీంతో ఎస్టీపీల చుట్టు పకల నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని, ఎస్టీపీల నుంచి దుర్వాసన వెలువడకుండా చూడాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జలమండలిని ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎస్టీపీల నుంచి వెలువడే దుర్వాసనను కట్టడి చేసేందుకు ఉన్న సాంకేతికతను జలమండలి అధ్యయనం చేస్తున్నది. ఇందుకుగానూ ఈ రంగంలో పని చేస్తున్న సంస్థలను సంప్రదించింది. ఢిల్లీ, ముంబై, పుణె, హోస్ పేట(కర్ణాటక)కు చెందిన పలు సంస్థల ప్రతినిధులు బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఎస్టీపీల నుంచి దుర్వాసన కట్టడికి ఆయా సంస్థల వద్ద ఉన్న సాంకేతికత, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతికత గురించి జలమండలి ఎండీ దాన కిశోర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే, మరింత సమగ్రంగా నివేదించడానికి గానూ నగరంలో నిర్మిస్తున్న ఎస్టీపీల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఈ సంస్థల ప్రతినిధులకు జలమండలి ఎండీ దాన కిశోర్ సూచించారు. ఎండీ సూచన మేరకు గురువారం వీరు నగరంలో నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించి పరిశీలించనున్నారు.. కాగా, నగరంలో నిర్మిస్తున్న ఎస్టీపీల్లో నూతన సాంకేతికతను జలమండలి వినియోగిస్తున్నది. తకువ సమయంలో ఎకువ మురుగునీటిని సమర్థవంతంగా శుద్ధి చేసేందుకు ఉన్న అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకునేలా కొత్త ఎస్టీపీలను నిర్మిస్తున్నది. ఎస్టీపీల ప్రాంగణాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని, ఇందుకుగానూ ల్యాండ్ సేపింగ్ చేయాలని జలమండలి ఎండీ ఇప్పటికే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.