మేడ్చల్, నవంబర్ 22: హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో మంగళవారం అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. మేడ్చల్‌తో పాటు ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, ఘట్కేసర్ మండలం అవుషాపూర్ను సందర్శించారు. మేడ్చల్ పర్యటనలో ఆయన జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలను పరిశీలించారు. వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి, కమిషనర్ అహ్మద్ షఫియుల్లాహ్ హరితహారంలో నాటిన మొక్కలు, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం ఆయన మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
అవుషాపూర్‌లో…
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండల పరిధి అవుషాపూర్ పంచాయతీ పరిధిలోని అడిషనల్ కలెక్టర్ పర్యటించారు. డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, ప్రభుత్వ పాఠశాలను ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో కలిసి సందర్శించారు. గ్రామంలోని డంపింగ్ యార్డు నిర్వహణతో పాటు చెత్తతో తయారు చేస్తున్న ఎరువులు, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, శ్మశాన వాటిక నిర్వహణను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠశాలలలో ఉండాల్సిన వసతులను తనిఖీ చేశారు. ముత్రశాలల నిర్వహణతో పాటు విద్యాబోధన తీరును, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత కలిగిన విద్యా బోధన ఉండాలని చెప్పారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడం పట్ల పాలకవర్గ పని తీరును అభినందించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించటంతో పాటు గ్రామాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేయాలన్నారు.
ఘట్కేసర్లో..
ఘట్కేసర్: ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో అడిషనల్ కలెక్టర్ పర్యటించారు. చైర్మన్లు ముల్లి పావని జంగయ్య యాదవ్, బి.కొండల్ రెడ్డిలతో కలిసి చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పనులను నాణ్యతగా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వైకుంఠధామాలు, పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్లు సురేశ్, వేమన రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.