దశాబ్దకాలంగా ఓ కిక్రెట్ కోచ్ వినూత్న ప్రయత్నం..
తెలుగు రాష్ర్టాల్లోని 280మంది క్రీడాకారులతో ముఖాముఖి
వారి అనుభవాలతో నేటి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం..
‘స్పోర్టింగ్ పెరల్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్’కు రూపం..
వావ్.. సచిన్ సెంచరీ కొట్టాడు.. అయ్యో.. సచిన్ డకౌట్ అయ్యాడు.. ఇలా.. ఇంట్లో ఎప్పుడూ సచిన్ పాటే. ఏంట్రా బాబు ఎప్పుడు క్రికెట్..సచిన్.. అంటావ్.. ఇక వేరే ఆటలు.. ఆటగాళ్లు లేరా..? అడిగింది బామ్మ.. ఈ మాటే ఆ యువకుడిని ఆలోచనలో పడేసింది. కోట్లాది జనాభాలో అసలు క్రీడాకారుల కోసం ఆన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణ నుంచే ‘క్రీడా ఆణిముత్యాలు’ వెలుగులోకి వచ్చింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్‌గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడాకారుల అన్వేషణ ప్రారంభించాడు. ఈ ప్రయాణంలో తెలుగు రాష్ర్టాల్లోని మొత్తం 280 మంది క్రీడాకారులను గుర్తించి వారితో స్వయంగా మాట్లాడాడు. విదేశాలలో ఉన్న వారితో మెయిల్ ద్వారా వివరాలను తీసుకున్నాడు. వీరందరి విజయగాథలతో నేటితరం యువతకు ఆదర్శంగా ఉండేలా ‘స్పోర్టింగ్ పెరల్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఓ క్రీడా పుస్తకాన్ని రూపొందిస్తున్నాడు. స్వచ్ఛందంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రఘు ఒక వైపు కుటుంబం, ఉద్యోగం చూసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా క్రీడాకారుల అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తున్నాడు. మత్తు, చెడు అలవాట్ల బారిన పడకుండా యువతను మేలుకొల్పే విధంగా ఈ పుస్తకం తీసుకురావాలనే ఆశయంతో ఉన్నాడు.
ఒలింపిక్స్‌లో 14 మంది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ పోటీలలో వివిధ క్రీడా విభాగంలో ఆడిన వారు 14 మంది ఉన్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటిన్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, చెస్, క్రికెట్, సైక్లింగ్, క్యారమ్స్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, రోలర్ స్కేటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి పోటీలలో దాదాపు 280 మంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విజయాలను సాధించి దేశ ప్రతిష్టను పెంచారని స్పష్టమైంది.
యువత క్రీడలపై దృష్టి పెట్టాలి
యువకులు క్రీడల పై ఆసక్తిని పెంచుకోవాలి. ఈ క్రీడా ఆణిముత్యాల గురించి వారికి తెలియాలి. కోట్లాది మంది ఉన్న జనాభాలో అతి స్వల్పంగా క్రీడాకారులు ఉండడం బాధ కలిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్, చెడు స్నేహం, మత్తులో ఉండిపోవడం జీవితం కాదు వ్యక్తిగత గుర్తింపుతో పాటు దేశ ప్రతిష్టకు కృషి చేయాలి. క్రీడలు అనగానే క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మన తెలంగాణ నుంచి క్యారమ్స్ పోటీల్లో ప్రపంచ చాంపియన్లు ఉన్నారు. కాబట్టి మనకు ఇష్టమైన క్రీడను ఎంచుకుని అందులో జాతీయంగా, అంతర్జాతీయంగా రాణించడానికి కష్టపడాలి.
– రఘు, క్రికెట్ కోచ్