చార్మినార్, జూలై 11 : బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్తో కలిసి లాల్ దర్వాజా సింహావాహిని ఆలయ శిఖర పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రతినిధులు అధికారులకు సాదర స్వాగతం పలికి శిఖర, ధ్వజారోహణ పూజాధి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగాసీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగర కొత్వాల్ను శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆలయ కమిటీకి ఆనవాయితీగ వస్తుందన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన ఆలయం. 1908 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా నగరంలో మూసీ నదిలో వరదలు భారీగా పెరిగిపోయాయి. ప్లేగు వ్యాధితోపాటు అంటు వ్యాధులు సైతం పెరుగుతూ 50 వేల మంది ప్రాణాలని బలిగొన్నాయి. పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో నాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా సింహావాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ తర్వాత మూసీ నదిలో వరదలు, వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుండి ఆషాఢమాసంలో బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సుమారు 120 సంవత్సరాలుగా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఇక్కడ బోనాల పండుగలు నిర్వహిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు.
ఆలయ కమిటీ వారు అందరి సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేసిందని సీపీ తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టామని, హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, అదనంగా బయట నుండి పోలీస్ సిబ్బందిని రప్పిస్తున్నామని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ కోరారు. పోలీస్ తరఫున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, బోనాల సందర్భంగా జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా క్రైమ్ విభాగం పోలీసులతో, షీ టీమ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, కె. అపూర్వ రావు, డీసీపీ స్నేహ మెహ్రా, ట్రాఫిక్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లుతో పాటు ఇతర అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.