Hyderabad | హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నైజీరియాకు చెందిన అగ్ బో మ్యాక్స్‌వెల్, ఇకెం ఆస్టిన్ ఒబాక, చిగోజీలతో పాటు సాయి ఆకేష్(హైదరాబాద్)ను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం పోలీసులు నెల రోజుల పాటు బెంగళూరులోనే మకాం వేశారు. నైజిరీయన్ల కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. మరో నైజిరీయన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో డ్రగ్స్ కింగ్‌ఫిన్ మ్యాక్స్ వెల్ ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీపీ పేర్కొన్నారు. మ్యాక్స్ వెల్, చిగోజి నైజీరియన్ నుంచి మెడికల్ వీసాపై వచ్చారని, మరో నిందితుడు ఒబాక స్టూడెంట్ వీసాపై వచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం పట్టుబడ్డ గ్యాంగ్ చాలా తెలివిగా డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు తమ విచారణలో తేలిందన్నారు సీపీ. నకిలీ అడ్రస్‌లతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించారు. దాదాపు ఆరు నెలల్లో రూ. 4 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. నైజీరియన్ ముఠా సభ్యులు బెంగళూరులో ఉంటూ హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్ వాసులు సంజయ్ కుమార్, తుమ్మ భాను తేజని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేయగా, వారిచ్చిన సమాచారంతోనే ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వివరించారు.