సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఏడాది పాలనలో హైదరాబాద్ నగరానికి ఒరిగేదేమి లేదు. ఇప్పటివరకు రెండు దఫాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. నగరాభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించి, చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించిందే తప్పా… సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలోనూ తట్టెడు మట్టిని తీసిన దాఖలాలు లేవు. కానీ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ఇప్పుడు హడావుడి పూర్తి చేసి…ఘనంగా ప్రారంభోత్సవాలను నిర్వహిస్తుందే తప్పా… ఇప్పటివరకు తమ కలల ప్రాజెక్టులనీ కాంగ్రెస్ సర్కారు చెప్పుకున్న ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కార్యారూపంలోకి కూడా తీసుకురాలేకపోయిందనే దానికి హైదరాబాద్ కేంద్రంగా గడిచిన ఏడాది కాలంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు, ప్రారంభించిన ఫ్లైఓవర్లు, ఎస్టీపీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో మెరుగైన రవాణా సౌలతులను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును హెచ్-సిటీగా మార్చిన కాంగ్రెస్ సర్కారు… చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించినవే నగరవాసులకు కనిపిస్తున్నాయి.
ఐటీ కారిడార్‌లో మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గోపన్‌పల్లి కేంద్రంగా హైలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను చేపట్టింది. అప్పటికే 98 శాతం పనులు పూర్తి చేయగా… ఎన్నికల కారణంగా కొంత జాప్యం జరిగింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలో మిగిలిన ఆ కొద్ది పనులను అట్టహాసంగా పూర్తి చేసి… గోపన్‌పల్లి కేంద్రం భారీ బహిరంగ సభతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. 2020లో వచ్చిన వరద ముప్పును దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సర్కారు నగరంలో వరద నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు అనుగునంగా ఫ్లడ్ వాటర్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులను చేపట్టింది. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో నగరావ్యాప్తంగా రెయిన్ వాటర్ ఛానళ్లను ఆధునీకరించింది. అలా చేపట్టిన ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుబాటులోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రారంభించిన బైరామల్‌గూడ్, జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను డిసెంబర్ నెలలో ప్రారంభించింది. నగరంలో వరద నియంత్రణకు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులకు కాంగ్రెస్ పార్టీ గడిచిన 15 నెలలుగా టెండర్లు పిలవలేకపోయింది. 34 చోట్ల పనులు చేపట్టాల్సి ఉన్నా… ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఎస్ఎన్డీపీ తొలి దశ ప్రాజెక్టు కోసం 985 కోట్లతో చేపడితే… రెండో దశ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు కోసం రూ. 528 కోట్లతో ప్రారంభించింది కానీ ఇప్పటి టెండర్ దశలోనే ఉన్నాయి.