సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నాగార్జునసాగర్‌లో అత్యవసర పంపింగ్ ప్రారంభమైంది. మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోత చేపట్టేందుకు సాగర్‌లో కనీసంగా 510 అడుగులు (ఎండీడీఎల్) నీటిమట్టం ఉండాలి. అంతకంటే నీటిమట్టం తగ్గడంతో జలమండలి అధికారులు అత్యవసర మోటర్లను ఏర్పాటు చేసి.. సాగర్ జలాశయం నుంచి నీటిని మాధవరెడ్డి ప్రాజెక్టులోని అప్రోచ్ చానల్లోకి తరలిస్తున్నారు. తద్వారా ప్రాజెక్టు మోటర్ల ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌కు నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి వద్ద నాగార్జునసాగర్ ఫోర్‌షోర్‌లో పది పంపుల్ని ఏర్పాటు చేయగా… శనివారం ఎండీ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు.
నగర తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్‌లో అత్యవసర పంపింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే నెల 15 నుంచి ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు జలాశయాల్లో నీరుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఢోకా లేదన్నారు. సాగర్‌లో ప్రస్తుతం 508 అడుగుల నీటిమట్టం ఉన్నదని, ఎండీడీఎల్ 510 అడుగుల కంటే నీటిమట్టం తగ్గినందున అత్యవసర పంపింగ్ ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే నగరంలో 175 ఎంఎల్డీల అదనపు నీటిని సరఫరా చేస్తున్నామని ఎండీ వివరించారు. వచ్చే నెల 15 నుంచి మరో 30 ఎంఎల్డీల అదనపు నీటిని కూడా సరఫరా చేస్తామన్నారు. ఈడీ సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్-2 సుదర్శన్ పాల్గొన్నారు.