మలక్‌పేట, మే 1: వరకట్నంగా తెచ్చిన ఆస్తులన్నింటినీ అమ్మేసి, అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, తనను ఇంటి నుంచి గెంటి వేశారని, తనకు న్యాయం చేకూర్చాలని కోరుతూ సామాజిక కార్యకర్తలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన సంఘటన ముసారాంబాగ్‌లోని శాలివాహననగర్‌లో చోటుచేసుకున్నది. ఉప్పుగూడకు చెందిన యువతి అనూష వివాహం మూసారాంబాగ్ శాలివాహననగర్‌కు చెందిన వినయ్కుమార్రావుతో 2018లో జరిగింది. రెండేళ్లపాటు వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది.
2020లో వీరికి అంగవైకల్యం కలిగిన కుమారుడు జన్మించాడు. దీంతో పెండ్లి సమయంలో తాను కట్నంగా తెచ్చిన ఆస్తులన్నింటినీ 2022లో అమ్మేసిన వినయ్‌కుమార్ అదనపు కట్నం కోసం తనను వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులకు అతడి తల్లి(అత్త)కూడా తోడైంది. ఇద్దరూ వేధించి ఇంటి నుంచి గెంటివేశారని, అంగవైకల్యం కలిగిన తన కుమారుడిని కూడా వారి వద్దే ఉంచుకున్న వినయ్‌కుమార్ తనను ఇంట్లోకి రానీయ్యకపోవడంతో తాను మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.
అక్కడ కూడాన్యాయం జరగలేదని, కోర్టును ఆశ్రయించగా..కోర్టులో కాలయాపన తప్ప, న్యాయం జరగలేదని ఆమె తెలిపారు. వికలాంగుడైన తన కుమారుడిని తనకు చూపించడంలేదని, పైపెచ్చు తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మీడియాతో వాపోయారు. వికలాంగుడైన తన కుమారుడి చికిత్సకు నెలకు రూ. 25 వేలు ఖర్చు అవుతాయని, తన కుమారుడిని చూపించకుండా దాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని మహిళా సామాజిక కార్యకర్తలు ఈ సందర్భంగా అన్నారు. బాధిత మహిళ ఆందోళనకు తాము మద్దతుగా నిలువడం జరిగిందని మహిళా సామాజిక కార్యకర్త ఇందిర తెలిపారు.