సిటీబ్యూరో, జూలై11, (నమస్తే తెలంగాణ): నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్ను పై రూ. వేలల్లో బిల్లులు కట్టాలంటే మండిపడుతున్నారు పెద్ద అంబర్‌పేటలోని గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాల వాసులు. ఎంత నీళ్లు వాడుకున్నారనే విషయం తెలుసుకునేందుకు మీటర్లు సైతం అమర్చకుండానే జలమండలి అధికారులు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై అధికారులను ఆశ్రయించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
రంగారెడ్డి జిల్లాలోని గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాలు గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండటంతో ఆ గ్రామంలో బోరు ఒకటి వేయించుకొని తాగు నీరు అవసరాలు తీర్చుకున్నారు. గ్రామపంచాయతీకి ప్రజలు నామమాత్రపు పన్ను చెల్లించి ఆ నీటిని వాడుకున్నారు. అయితే ఆ రెండు గ్రామాలను పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలో విలీనం చేయడంతో వాటిని వార్డులుగా మార్చారు. మిషన్ భగీరథ పైన్‌లైన్ల నుంచే వాటర్బోర్డ్ నీటిని అందిస్తుండటం గమనార్హం. ఎలాంటి సమాచారం లేకుండానే అధికారులు సర్వే పేరుతో వచ్చి జలమండలి నీటిని ప్రజలకు అందించారు.
గ్రామస్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకుండానే జలమండలి నీటిని ఆ ప్రాంతాల ప్రజలకు అందిస్తూ నీటి బిల్లులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో నీటి బిల్లులు చెల్లించాలంటూ జలమండలి నుంచి ఎలాంటి మెసేజ్‌లు రాకపోగా, తరువాతి కాలంలో ప్రతినెలా నీటి బకాయిలు చెల్లించాలని సందేశాలు రావడం చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొన్నిరోజులపాటు సైబర్ క్రైం నుంచి వస్తున్నాయనే భయంతో ఆ మెసేజ్‌లను కొట్టిపారేశారు. కానీ అనుమానం వచ్చి అధికారులను సంప్రదించగా పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రజలపై జలమండలి అధికారులు హుకూం జారీ చేశారు.
దీంతో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలను చూసి నివ్వెరపోవడం బాధితుల వంతైంది. ప్రస్తుతానికి ఆ రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలపై ఒక్కొక్కరిపై రూ.18వేల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ జలమండలి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. అంత మొత్తంలో బకాయిలు చూసి వారంతా కంగుతింటున్నారు. అనవసరంగా మమ్మల్ని నగర పంచాయతీలో విలీనం చేసి తీరని అన్యాయం చేశారంటూ వాపోతున్నారు. గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాల ప్రజల్లో పలువురు వ్యవసాయం చేస్తుండగా, మిగతా వారు ఆటో డ్రైవర్లుగా, పెయింటర్లుగా, దినసరి కూలీలుగా పనిచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా పనిచేస్తేగాని ఇల్లు గడవని కుటుంబాలు ఆ గ్రామాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.
జలమండలి నిబంధనల ప్రకారం జలమండలి అందించే నీరు వాడుకునే వినియోగదారుడు ప్రతినెలా రూ. 245 మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంది. కానీ గౌరెల్లి, కుత్బుల్లాపూర్ ప్రజల వద్ద మీటర్లు సైతం బిగించకుండా రూ.320 బిల్లు కట్టాలంటూ సందేశాల్లో పేర్కొన్నారు. జలమండలి వసూలు చేసే అడ్డగోలు దోపిడీపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలపై నేడు తీవ్రమైన భారం పడింది. నీళ్ల కోసం అప్పులు తెచ్చి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లులు వేయడమేంటని బాధితులు వాపోతున్నారు.