Khairatabad | ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. మంగళవారం నిమజ్జనం నేపథ్యంలో దర్శనానికి ఆదివారం రోజు చివరి రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మహా వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి చివరిరోజు కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. భారీ గణనాథుడిని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. అర్ధరాత్రి వరకే మహాగణపతి దర్శనానికి సమయం ఉండడంతో లక్షలాది మంది దర్శనం కోసం తరలివచ్చారు.
క్యూలైన్లో భక్తులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని.. చిన్నారులు సైతం తీవ్ర ఇబ్బందులుపడ్డారు. భక్తులు, వాహనాలతో ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. ఖైరతాబాద్‌తో పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌కు విపరీతంగా రద్దీ పెరిగింది. నిన్న ఒకేరోజు 94వేల మంది ఈ స్టేషన్ నుంచి ప్రయాణించారు. ఇవాళ లక్షకుపైగానే రాకపోకలు నమోదైనట్లుగా తెలుస్తున్నది. మరో వైపు ఖైరతాబాద్‌లో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. ఖైరతాబాద్ మహా వినాయకుడి శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారంభమై.. మధ్యాహ్నం వరకు నిమజ్జనం ముగియనున్నది. ఈ క్రమంలో శోభాయాత్రకు సంబంధించి వెల్డింగ్ తదితర పనుల కోసం సోమవారం దర్శనాలను నిలిపివేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.