Hyderabad | జల్సాలు, బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ యవకుడు దొంగగా మారాడు. వ్యసనాల కారణంగా చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాల్సిన ఆ యువకుడు.. ఇప్పుడు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఉప్పులేటి శశి కుమార్ (21) ప్రస్తుతం ఎల్బీనగర్ సమీపంలోని సూర్యోదయ నగర్ కాలనీలో నివాసం ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన శశికుమార్.. తనకు కావాల్సిన డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఒంటరిగా కనిపించిన మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడాలని పథకం వేసుకున్నాడు. అందుకు అనుగుణంగానే చంద్రపురి కాలనీలో పలుమార్లు రెక్కీ నిర్వహించాడు.
ఈ నెల 3వ తేదీన చంద్రపురి కాలనీలో నివాసం ఉండే బుర్ర రుక్మిణి వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి వెళ్లిన శశికుమార్.. ఆమె మెడలో ఉన్న 15 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజితో పాటు పలు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని వెతుకుతున్న క్రమంలో సూర్యోదయ నగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతూ శశికుమార్ కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం విషయం బయటపడింది. జల్సాలు, బెట్టింగ్‌లకు కోసం చేసిన అప్పులు తీర్చేందుకే చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో శశికుమార్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.