HMDA | హైదరాబాద్ : హెచ్ఎండీఏ సేవలకు బుధవారం ఉదయం నుంచి అంతరాయం కలిగింది. హెచ్ఎండీఏ వెబ్సైట్ సర్వర్ డౌన్ కావడంతో.. అన్ని రకాల ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ నగర పౌరులు ఆన్లైన్ సేవలను హెచ్ఎండీఏ వెబ్సైట్ ద్వారా కొనసాగిస్తున్నారు. డేటా ఓవర్ లోడ్ కారణంగా నిన్న అర్ధరాత్రి నుంచి కార్యకలాపాలు నిలిచిపోయాయని అధికారులు గుర్తించారు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోర్ చేసే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
కాగా, హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హెచ్ఎండీఏ వెబ్సైట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెరువుల కబ్జాలపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ వెబ్సైట్లో చెరువులకు సంబంధించిన డేటా కనిపించడం లేదు. దీంతో హెచ్ఎండీఏ వెబ్సైట్ సేవలు నిలిచిపోడంపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోన్న సంగతి తెలిసిందే. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్‌పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా తన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్పూర్లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Gachibowli | గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. 18 మంది అరెస్ట్