రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని విభాగాల్లో రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగులే పైచేయిగా నిలవడంతో.. వారు చేసే తప్పిదాలు రెగ్యులర్ ఉద్యోగుల మెడకు చుట్టుకుంటున్నాయని వాపోతున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకం లేకపోవడంతో కొంత కాలంగా డిప్యుటేషన్, రిటైర్డ్ ఉద్యోగుల హవా నడుస్తోంది. ముఖ్యంగా ప్లానింగ్, ఇంజినీరింగ్‌తో పాటు, ఇతర అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. హెచ్ఎండీఏకు ఆదాయం తీసుకువచ్చే ప్లానింగ్, ఎస్టేట్, అర్బన్ ఫారెస్ట్రీ ప్రధాన విభాగాల్లో రిటైర్డ్, డిప్యుటేషన్ ప్రాతిపదికన చేరి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమతులు, ఎన్ఓసీల విషయంలో చేతివాటం ప్రదర్శించిన సందర్భాల్లో హెచ్ఎండీఏ కీలుబొమ్మలా మారింది. దీంతో అధికారులు ఇచ్చే అనుమతుల వెనుక డిప్యుటేషన్, రిటైర్డ్ ఉద్యోగుల ప్రలోభాలు కూడా ఉండటంతో అసలు విషయం వెలుగులోకి రాకుండా కప్పి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్లానింగ్ నిర్వీర్యం..
హెచ్ఎండీఏకు ఆదాయం సమకూర్చడంలో ప్లానింగ్ విభాగం అత్యంత కీలకపాత్రను పోషిస్తోంది. ఈ క్రమంలో వీరిచ్చే అనుమతులు, భవన నిర్మాణ ఎన్ఓసీలతోపాటు, ఓసీ వంటి ఇతర కార్యకలాపాలు అన్ని కూడా వీరి ఆధీనంలో సాగుతాయి. అయితే వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఆఫీసు బయటకు రాకపోవడంతో కన్సల్టెన్సీల మాటున గుట్టుగా వ్యవహారాలు చెక్కబెట్టేస్తున్నారు. దీంతోనే ప్లానింగ్ విభాగం ఇచ్చే ఎన్నో అనుమతుల్లో కూడా తప్పులు జరుగుతున్నట్లు తేలింది. ఇక అన్ని విభాగాల్లో తిష్ట వేసిన డిప్యుటేషన్ అధికారుల ఆగడాలతో మాతృ సంస్థకు చెందిన ఉద్యోగులు పలు వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని, కనీసం వారిపై చర్యలు తీసుకునే వీల్లేకపోవడంతో ఆడింది ఆటగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. డిప్యుటేషన్, రిటైర్డ్ ఉద్యోగుల అరాచకంతో హెచ్ఎండీఏను అప్రతిష్ట పాలు చేయడంతోపాటు, ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుందనే విమర్శలున్నాయి. ఎస్టేట్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది సంస్థకు రావాల్సిన అదాయ వ్యవహారాలను చక్కబెట్టాల్సింది పోయి… బయటి వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
హైడ్రా నోటీసులతో ఝలక్..
తాజాగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కొంత మంది హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో డీటీసీపీ, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన కొందరు ఉద్యోగులు వీటిని సొమ్ము చేసుకొని అనుమతులిచ్చిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఇటీవల హైడ్రా కూల్చివేతలతో విషయం వెలుగులోకి రావడంతో రెగ్యులర్ ఉద్యోగుల మెడకు ఎక్కడ ఈ వివాదం చుట్టు కుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. నిజానికి అనుమతుల వ్యవహారాలన్నీ కన్సల్టెన్సీలతో చక్కబెట్టిన కొందరు అధికారులు, తీరా అనుమతులు ఇచ్చి జేబులు నింపుకోవడంతోనే ఈ పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి అసలు కారకులపై చర్యలు తీసుకుంటే గానీ, హెచ్ఎండీఏ రెగ్యులర్ ఉద్యోగులకు వేధింపులు తప్పేలా లేవని వాపోతున్నారు.