HMDA | సిటీబ్యూరో: ఖజానా నిండే ల్యాండింగ్ పూలింగ్ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన హెచ్ఎండీఏ… అంతలోనే ఆపేసింది. ఓఆర్ఆర్ వరకు శరవేగంగా విస్తరించిన హైదరాబాద్ నగరానికి అనుగుణంగా భారీ లే అవుట్లకు డిజైన్ చేయగా, ప్రాజెక్టులో పురోగతి లేకుండా పోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్‌కు అనువైన ప్రాంతాలను హెచ్ఎండీఏ ఎంపిక చేసింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కార్యరూపంలోకి తీసుకురాలేదు. భూముల లభ్యతలో పురోగతి ఉన్నా… భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో నగరంలో భారీ లే అవుట్లను అభివృద్ధి చేస్తామన్న సర్కారు లక్ష్యం నీరుగారిపోతున్నది.
సిటీ శివారుల్లో సుమారు 1500 ఎకరాల పూలింగ్ లక్ష్యంగా కాగా.. 900 ఎకరాలు సిద్ధంగా ఉంది. మిగిలిన 600 ఎకరాల కోసం రైతులతో చర్చలు జరిగాయి. ప్రతాప సింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ వంటి ప్రాంతాల్లో 900 ఎకరాలకు పైగా భూమిని డెవలప్మెంట్ కోసం గుర్తించారు. భూ యజమానులను ఒప్పించి 60-40 రేషియోలో డెవలప్మెంట్ ఖర్చులతో లే అవుట్లుగా హెచ్ఎండీఏ తీర్చిదిద్దాల్సి ఉంది. కానీ ఇప్పటికీ భూ సేకరణ ప్రక్రియలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. భూముల ధరలు పెరగడం, హెచ్ఎండీఏ ఇచ్చే వాటా సరిపోకపోవడం, డెవలప్మెంట్ పేరిట హెచ్ఎండీఏ చేసే కాలయాపన కూడా ల్యాండ్ పూలింగ్‌కు ఆటంకంగా మారుతున్నదని భావిస్తున్నారు.
లే అవుట్లను డెవలప్ అయ్యే నాటికి అక్కడ భూముల ధరలు పెరగడంతో… రైతులకు అనుకున్నంత పరిహారం రావడం లేదని తెలిసింది. దీంతోనే హెచ్ఎండీఏ చేపట్టే ల్యాండ్ పూలింగ్‌కు ఆదరణ రావడం లేదని, రైతులు కూడా అనాసక్తితో ఉన్నారని వెల్లడైంది. ఇప్పటికే గుర్తించిన ప్రతిపాదిత ప్రాంతాల విషయం ఇలా ఉంటే… హైదరాబాద్ చుట్టూ సుమారు 11వేల ఎకరాలను సమీకరించాలనే ప్రతిపాదనలను సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు హెచ్ఎండీఏకు మౌఖిక ఆదేశించినట్లుగా తెలిసింది. అయితే ఒక్క ప్రతిపాదనల్లోనూ పురోగతి లేదు. ఔటర్ సమీపంలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సర్కారు ఆదాయాన్ని పెంచేందుకు భారీ లే అవుట్లను ఔటర్ చుట్టూ ఏర్పాటు చేసేలా కార్యాచరణను హెచ్ఎండీఏ అమలు చేస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో పలు చోట్ల భారీ కొత్త లే అవుట్లను అభివృద్ధి చేసి.. నిధులు సమకూర్చుకునేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. రైతుల నుంచి సేకరించిన భూములను డెవలప్ చేసి విక్రయించాలని భావించింది. కానీ హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ప్రతిపాదించిన కొర్రెముల, ప్రతాపసింగారం, బోగారం, దండు మల్కాపూర్ వంటి ప్రాంతాల్లో డెవలప్ చేయాలని భావించిన ప్రాజెక్టులు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏలో లే అవుట్లను డెవలప్ చేస్తూ రైతుల వాటాను 60 శాతంగా అమలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న భూముల ధరలకు అనుగుణంగా తమ వాటా శాతాన్ని పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.