హైదరాబాద్, డిసెంబర్ 10, (నమస్తే తెలంగాణ): ఆర్టీఐ కింద దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణ యం తీసుకోవాలని తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, గత కమిషనర్ ఇలంబర్తిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శేరిలింగంపల్లిలో సిటీ ప్లానర్లు జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు ఆర్టీఐ కింద సంబంధించి రికార్డుల పరిశీలనకు అనుమతించకపోవడాన్ని సికింద్రాబాద్‌కు చెందిన శ్యామ్ పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన మొదటి అప్పీలుపై నాలు గు వారాల్లోగా చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని నవంబర్‌లో హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణగా పరిగణించి చర్యలు తీసుకోవాలని పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం విచారించారు. రికార్డులను పరిశీలనకు అనుమతించలేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. అప్పీలుపై కమిషనర్ ఇప్పటివరకు కావాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు.
వాదనల తర్వాత జస్టిస్ నగేష్ భీమపాక స్పందిస్తూ, జనవరి 9 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని, చేయకపోతే కమిషనర్/మాజీ కమిషనర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలను జారీ చేశారు. కౌంటరు దాఖలు చేయకపోతే రూ. 10 వేలను కోర్టు ఖర్చుల కింద హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు చెల్లించాలని ఆదేశించారు.