హైదరాబాద్, జూలై 4, (నమస్తే తెలంగాణ) : ఇవి అక్రమ నిర్మాణాలు.. అని సదరు అక్రమ నిర్మాణాల వద్ద బోర్డులు, అవసరమైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక సూచన చేసింది. ఫలానా భవనం అక్రమంగా నిర్మాణం అనే విషయం తెలిస్తే ప్రజలు మోసపోరని అభిప్రాయపడింది. సాధారణ భవనాలతో పాటు హైరైజ్ బిల్డింగ్లు అక్రమ నిర్మాణమని తెలిస్తే ప్రజలు కొనుగోలు చేయకుండా జాగ్రత్తపడతారని చెప్పింది.
అంతేకాకుండా, అక్రమ నిర్మాణ భవనంలో ఉన్న వాళ్లు పరువుపోతుందని భావించి తదుపరి చర్యల కోసం ప్రయత్నిస్తారంది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల విషయాన్ని కూడా బోర్డులు, హోర్డింగ్స్‌లో పేరొనాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇలా చేయడం వల్ల ప్రజలు, ప్రభుత్వ అధికారులపై ఆధారపడే పరిస్థితి ఉండదని తెలిపింది. ప్రజలకు చట్టప్రకారం రక్షణ చర్యలు కల్పించినట్లు కూడా అవుతుందని చెప్పింది. హైదరాబాద్, తోటగూడలోని అనధికారిక భవనంపై చర్యలు తీసుకోవాలని
గతంలో కోర్టు ఆదేశించినప్పటికీ ఆ అక్రమ నిర్మాణం కూల్చడం లేదంటూ హైదరాబాద్ మహారాజ్ గంజ్, గౌలిగూడకు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ సందర్భంగా ఈ కీలక సూచనలు చేశారు. పిటిషనర్ పేరొన్న భవనం విషయంలో తాము గతంలో స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీని ప్రశ్నించారు. ప్రజలు కోర్టుకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని, కోర్టు ఆదేశాల అమలుకు తాత్సారం ఎందుకు చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. కూల్చివేతలపై సందేహాలు ఉంటే భవనాన్ని సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు కదా అని అన్నారు.
అధికారులు జాప్యం చేయడం వల్ల కోర్టులు, పోలీసులు, అధికారులంటే అక్రమ నిర్మాణదారులకు భయం లేకుండాపోతుందన్నారు. కార్యాలయాల్లో అన్ని సౌకర్యాల కల్పన జరిగిందని, అద్భుత భవనాల్లో కంప్యూటర్లు, ఇతర వసతులను ప్రభుత్వం కల్పించిందని, సాంకేతికతలో అంతర్జాతీయ స్థాయి పేరు గడించామని, అయినా కొందరు అధికారులు, సిబ్బంది పని తీరు మారడం లేదని తప్పుపట్టారు. ఈ విషయాల్లో పురపాలక శాఖ అధికారులే కాదని, వాళ్లను వెనకేసుకొచ్చే స్టాడింగ్ కౌన్సిళ్ల పాత్ర ఉందన్నారు. కోర్టులు వందల ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఏదో ఒక సాకు చెప్పి అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తప్పుపట్టారు. పిటిషనర్ పేరొన్న భవనం విషయంపై వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని స్టాండింగ్ కౌన్సిల్ కోరడంతో విచారణను 11కి వాయిదా వేశారు.