హైదరాబాద్: మేడ్చల్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు (Hidden Camera) అమర్చి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. వీడియోల ఘటనపై కాలేజీ యాజమన్యం వెంటనే స్పందించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. అనుమానితుల వద్ద 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. కాగా, విద్యార్థినుల ఆందోళనలతో వారి కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. అయితే వారిని కళాశాల సిబ్బంది హాస్టల్లోకి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ గేటు దూకి.. తాళాన్ని పగులగొట్టి చొచ్చుకెళ్లారు.
కాగా, కాలేజీలో ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక దుండగుడు తొంగి చూశాడని ఫిర్యాదులో పేర్కొన్నారని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కిటికీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించిందన్నారు. మెస్‌లో పనిచేసే ఐదుగురిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారని, వీడియోలు రికార్డు చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తం 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు.