బరితెగిస్తున్న మత్తు ముఠాలు
మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలాకు పలు ప్రాంతాలు అడ్డాలుగా మారుతున్నాయి.
- గంజాయి.. మద్యం మత్తులో వీరవిహారం
- రాత్రి వేళ రోడ్డుపైకి రావాలంటేనే జంకుతున్న జనం
- మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
- గృహప్రవేశం చేసిన కుటుంబంపై దౌర్జన్యకాండ
- తమకు తెలియకుండా ఇల్లు కొన్నారంటూ.. దాడి
- ‘అధికార’ అండదండలతో రెచ్చిపోతున్న మత్తు గ్యాంగ్
- గంజాయి అడ్డాలపై సోషల్‌మీడియాలో వీడియోలు
- అస్తవ్యస్తమైన పెట్రోలింగ్ వ్యవస్థ… నిద్రావస్థలో నిఘా
సిటీబ్యూరో: మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలాకు పలు ప్రాంతాలు అడ్డాలుగా మారుతున్నాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు నేడు గంజాయి బ్యాచ్‌లు, మద్యం బాబుల వీరవిహారంతో వణికిపోతున్నాయి. రాత్రి వేళల్లో సామాన్య ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం వెరసి పోకిరీలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సొంతంగా ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా బతుకుదామన్నా సామాన్యుడికి రక్షణ కరువైంది. ఈ మత్తు బ్యాచ్‌లకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలంటూ ఉండడంతోనే యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.

మత్తు మూకల ఆగడాలు..
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో ఇల్లుకట్టుకొని సంతోషంగా గృహప్రవేశం చేస్తున్న శ్రావణ్ కుటుంబంపై అధికార పార్టీ నాయకుల అండదండలున్న మత్తు బ్యాచ్ వీరంగం సృష్టించింది. గృహప్రవేశం చేసిన శ్యాంరావుతో ‘మాకు తెలియకుండా ఇల్లు ఎలా కొంటావు..ఇక్కడ బోనాలు చేయాలం’టూ యాకయ్య బ్యాచ్ గొడవకు దిగింది. తమకు ఆదేశించడానికి మీరెవరంటూ ఇంటి యజమాని ప్రశ్నించడంతో తన అనుచరులైన సాయి గ్యాంగ్‌ను రప్పించి కొత్త ఇంట్లో ఉన్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఇక్కడ ఓ కాంగ్రెస్ నాయకుడు ముఠాలను పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా ఇండ్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఈ బ్యాచ్ ద్వారానే జరగాలని సాయి రాజు నేతృత్వంలో సాయి ముఠా పనిచేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 మంది వరకు ఈ ముఠా కొత్త ఇంటి యజమాని, ఆయన కుటుంబసభ్యులపై దాడి చేయడంతో మేడిపల్లి పోలీసులు అందులో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ ముఠా ఆ పనిచేసిందని కొందరు చెబుతున్నా, మద్యంతో పాటు గంజాయి కూడా సేవించడంతోనే ఆ వీరంగం చేశారంటూ.. మరికొందరు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ల్యాండ్ మాఫియా, రౌడీయిజం పరాకాష్టకు చేరాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ భగాయత్‌లో రాత్రి 9 అయ్యిందంటే చాలు అక్కడ గంజాయి, మద్యం బ్యాచ్‌లు రాజ్యామేలుతుంటాయని, అక్కడ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందంటూ సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రామంతాపూర్ ప్రాంతం లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోందంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. రామంతాపూర్‌లోని చెరువు వద్ద యువకులు, కొందరు మైనర్లు అడ్డా ఏర్పాటు చేసుకొని గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను సేవిస్తున్నారంటూ.. స్థానిక ప్రజలు ఆరోపణలు చేశారు. సోషల్‌మీడియాలో గంజాయి ఫొటోలను కూడా పోస్ట్ చేసి, అక్కడి మైనర్లతోనూ స్థానికులు మాట్లాడారు. చెరువు వద్ద మత్తు బ్యాచ్‌కు అడ్డ ఉన్న విషయాన్ని స్థానికులు వెలుగులోకి తెచ్చారు.
కమిషనరే స్వయంగా రంగంలోకి దిగినా..
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా సుమతి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆమె తన కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు, అర్ధరాత్రి మహిళలకు రక్షణ ఎలా ఉందో అని తెలుసుకోవడం కోసం స్వయంగా ఆమెనే రంగంలోకి దిగారు. నగరంలో మహిళలకు భద్రత లేదని, శాంతి భధ్రతలు పూర్తిగా క్షీణించాయనే విషయాన్ని స్వయంగా ఆమె చెప్పకనే చెప్పారని అప్పట్లో పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఆ ఘటనతో కమిషనరేట్ పరిధిలో పరిస్థితి మరింత మెరుగువుతుందని అందరు భావించినా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్తు మాయలోకి యువత, మైనర్లు యువకులు ఆకర్షితులవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వీరి ఆగడాలు పెరగడం, వారు చేసే అసాంఘిక పనులను చూసి తట్టుకోలేక స్థానికులు ఏకంగా వీడియోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పెడుతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకొని మత్తు మాయలో పడుతున్న యువత, మైనర్లపై పటిష్ట నిఘాను అమాలు చేయాల్సి ఉన్నా..ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ.. సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉప్పల్ భగాయత్ వంటి ఆధునిక లేవుట్లు, నిర్మానుష్యంగా ఉండే ఐటీ కారిడార్ల శివారు రోడ్లు, కాలనీల చివరన ఉండే పార్కులు రాత్రి 9 గంటలు దాటితే చాలు..గంజాయి బ్యాచ్‌ల స్వైరవిహారం సాగుతుందంటూ సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తే లాంటి మత్తు మూకల ఆటకట్టించేందుకు అవకాశం ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు.

ఘట్కేసర్ ప్రాంతం లో ఓ కుటుంబం ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా, గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకులు ఆ కారును నడిరోడ్డుపై అడ్డుకొని వేధింపులకు గురిచేశారు. కారు ముందు ద్విచక్రవాహనంపై వెళ్తూ కారులో ఉన్న వారిని బెదిరిస్తూ నానా హంగామా చేశారు. ఈ విషయాన్ని బాధితులు తమకు తెలిసిన వారి ద్వారా సోషల్‌మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. ఇలా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లోని పలు ప్రాంతాల్లో గంజాయి, మద్యం బ్యాచ్‌ల వీరంగంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

