Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. నగరంతో పాటు నాలుగు వైపులా వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒక్క వాహనం ముందుకు కదిలేందుకు గంటల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వెళ్లే రోడ్లలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలతో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. అనేక రహదారుల్లో కిలోమీటర్ కదిలేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. రాఖీ పండుగ, వారాంతం కారణంగా పెద్ద సంఖ్యలో ఊళ్లకు నగరవాసులు వెళ్తున్నారు.
ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వద్ద నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ మెల్లగా కదులుతోంది. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద రోడ్డు చిన్నగా ఉంది. దీంతో వాహనాలు హయత్‌నగర్ బస్టాండ్ వద్ద నెమ్మదిగా వాహనాలు కదులుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ, వారాంతం కారణంగా ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిందన్నారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా పెరిగాయి. బస్సులు బస్టాండ్‌లోని వెళ్తూ వస్తున్న క్రమంలో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుందన్నారు. నిత్యం విధుల్లో ఉంటూ ట్రాఫిక్ణు క్రమబద్దీకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్, అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వరకు వేలాది వాహనాలు నిలిచిపోయాయి. అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ వెళ్లేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది.
సికింద్రాబాద్ బొల్లారం చెక్‌పోస్టు వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అల్వాల్ నుంచి బొల్లారం చెక్‌పోస్టు వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలో కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, మూసాపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేపీహెచ్‌బీ నుంచి వివిధ జిల్లాలకు, ఏపీలోని పలు ప్రాంతాలకు బస్సులు వెళ్తున్నాయి. లక్డీకాపూల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. షాద్‌నగర్ నుంచి తిమ్మాపూర్, పాలమాకుల వైపు కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.