సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు గ్రేటర్‌లోని పలు చోట్ల కుండపోత వాన కురిసింది. రాత్రి సమయంలో కురవడంతో జనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఉదయం 8 గంటల వరకు వర్షం కురవడంతో తొలి రోజే పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉదయం సమయంలో పనులకు వెళ్లే వారి కొంత ఇబ్బందులు తప్పలేదు.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు నగరంలోని శేరిలింగంపల్లి, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యధికంగా 14.85 సెం.మీలు, చందానగర్‌లో 11 సెం.మీలు, గచ్చిబౌలిలో 8.13 సెం.మీలు, రాజేంద్రనగర్, హఫీజ్‌పేటలో 5.0 సెం.మీలు, మియాపూర్‌లో 4.63, చాంద్రాయణగుట్టలో 4.58 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అయితే మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కిన నగర వాతావరణం రెండు రోజులుగా కురుస్తున్న వానలతో కొంత చల్లబడింది.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.7, కనిష్ఠం 24.3 డిగ్రీలు, గాలిలో తేమ 64 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, రుతుపవనాలు చురుకుగా కదలడం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.