కూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు
కరెంట్ సరఫరాకు అంతరాయం
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది
మేడ్చల్ కలెక్టరేట్, మే 4 : మేడ్చల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల పరిధిలోని నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, ప్రజాసాయి గార్డెన్స్‌లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మరమ్మతు పనులు చేపట్టారు. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ వర్షంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
బోడుప్పల్లో భారీ వర్షం..
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. బహుళ అంతస్తుల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరుకుంది. వర్షపునీరు నిల్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో కాలనీవాసులకు పెద్దగా ఇబ్బందులు కలుగలేదు. 17వ డివిజన్ రాంరెడ్డి కాలనీలో నిలిచిన వర్షపునీరును తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. ఈదురు గాలులు బలంగా వీయడంతో విద్యుత్ స్తంభాలు కొన్నిచోట్ల నేలకొరిగాయి. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
గాలి వానతో విద్యుత్ అంతరాయం..
మేడ్చల్ రూరల్ : రాంపల్లి పరిధిలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో ఇబ్బందులు తలెత్తి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పలు గ్రామాల్లో వరిపైరు పక్కకు ఒరిగిపోయింది. అయితే, మేడ్చల్ మండలంలో వరి పంటకు నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
అకాల వర్షం.. జలమయమైన కాలనీలు
జవహర్‌నగర్: అకాల వర్షానికి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బుధవారం ఉదయం ఈదురు గాలులతో కూరిసిన వర్షంతో కేసీఆర్‌నగర్, న్యూదేవేందర్నగర్, సుస్మితానగర్ తదితర కాలనీల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సమాచారం అందుకున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు పలు ప్రాంతాలను సందర్శించి చర్యలు చేపట్టారు.