పొద్దంతా ఎండతో సతమతమైన నగరాన్ని సాయంత్రం వేళ.. గాలివాన వణికించింది..ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు.. అతి తక్కువ వ్యవధిలోనే ఒక్కసారిగా వాన ఉరుములా విరుచుపడటంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల ఈదురుగాలులు విధ్వంసమే సృష్టించాయి.. చెట్లు నేలకొరిగాయి.. తీగలు తెగి..విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. ఓ చోట ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది..రోడ్లపైకి వరద నీరు పోటెత్తడంతో ఎక్కడికక్కడే..ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు నరకం చూశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యల్లో జాప్యం కారణంగా ప్రజల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఫీడర్లు ట్రిప్ కావడం..విద్యుత్ పునరుద్ధరణలో జాప్యం కారణంగా నగరవాసులు జాగారం చేయాల్సి వచ్చింది. బండ్లగూడలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)
ఆకస్మిక గాలివాన మహానగరాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎండ, వేడితో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకునేలోపే.. గాలి వాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం, కరెంటు అంతరాయం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. పలు చోట్ల ఈదురు గాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసింది.
ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో 48 చెట్లు నేలకొరిగాయి. వీటిని తొలగించేదిశగా అటు బల్దియా, హైడ్రా పనులు చేపట్టింది. చెట్లు కూలి విద్యుత్ స్తంభాలపై, ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ తీగలపై పడడంతో చాలాచోట్ల గంటలకొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు వర్షం, మరోవైపు కరెంట్ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చిన్నచిన్న కారణాలతో సైతం సరఫరా నిలిపివేయడంతో నగరవాసులు విద్యుత్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం సాధారణ వర్షం పడినచోట సుమారు మూడునాలుగు గంటలు కరెంట్ నిలిపివేయడంతో ఎస్పీడీసీఎల్కు చాలా ఫిర్యాదులు వచ్చాయి. వర్షం కారణంగా కరెంట్ కోతలతో పలుప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ను పురుద్ధరించడానికి సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఇంకా కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూలిపోవడంతో విద్యుత్ పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశమున్నట్లు అధికారులు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బండ్లగూడలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పుర 7.8 సెంటీమీటర్లు, చార్మినార్ 7.6, నాంపల్లి 7, బండ్లగూడ మేకల మండి కమ్యూనిటీ హాల్ 7, చార్మినార్ మలక్‌పేట సర్కిల్ 6.6, చాంద్రయాణగుట్ట 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటలకొద్దీ నిలిచిపోయింది. ప్రధానంగా చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలపై పడడం, కొన్నిచోట్ల తీగలు తెగిపోవడంతో పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరిగింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని రోడ్డుపై ఓ భారీవృక్షం కూలిపోయి ట్రాన్స్ఫార్మర్పై పడింది. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. లంగర్‌హౌస్ బాపూనగర్ కాలనీలో చెట్టు కూలి రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి..లంగర్‌హౌస్ బాపూనగర్ వద్ద గాలివానకు రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ తీగలపై పడడంతో స్తంభం వంగిపోయింది. మోతీలాల్ నగర్, బడంగ్‌పేట, సరూర్‌నగర్‌లోని త్రివేణినగర్, మలక్‌పేట, గ్రీన్‌హిల్స్, సాయి ఎంక్లేవ్ హబ్సిగూడ, బజార్‌ఘట్ తదితర చోట్ల ఫీడర్లపై ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలు పడడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నగరవ్యాప్తంగా సుమారుగా 441 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. సైదాబాద్ కాలనీ జయనగర్ ఫీడర్పై చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మలక్‌పేట, ఇందిరాపార్క్, మొఘల్‌పుర, యాకుత్‌పుర, రాజేంద్రనగర్, బేగంపేట, షేక్‌పేట, అత్తాపూర్, సైదాబాద్, అమీర్‌పేట, ఉప్పరపల్లి, కుందన్‌బాగ్, చంచల్‌గూడ, బల్కంపేట, ఓల్డ్‌మలక్‌పేట, రసూల్‌పుర తదితర ప్రాంతాల్లో 4 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పలు ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణలో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.
రోడ్లపైనే చెట్లు కూలడంతో ప్రధాన జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సరూర్‌నగర్, విజయనగర్‌కాలనీ, కూకట్పల్లి, దారూసలాం, హైకోర్టు, బీఎన్‌రెడ్డినగర్, ఫలక్నగర్, సుల్తాన్‌బజార్, కాచిగూడ, సింధీకాలనీ, మెథడిస్ట్ కాలనీ, లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బషీర్‌బాగ్‌లో పీజీ లా కాలేజ్ ఎదుట రోడ్డుపై ఓ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్యాంక్‌బండ్ నుంచి లోయర్‌ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే రోడ్డులో చెట్లు కూలిపోయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఈదురు గాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు రోడ్లపై విరిగిపడ్డాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే దారిలో చెట్టు కూలింది. నాంపల్లి రెడ్ హిల్స్ కాలనీలోని ట్రాన్స్ఫార్మర్పై చెట్టు పడింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. లంగర్‌హౌస్‌లోని బాపు నగర్, బేగంపేట మోతిలాల్ నగర్లో వృక్షాలు నేలకొరిగాయి. మరోవైపు రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఇండ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గాలివానకు విద్యుత్ తీగలు తెగిపోవడం.. స్తంభాలుపడిపోవడం..ఫీడర్లు ట్రిప్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోగా..పునరుద్ధరణ..సహాయక చర్యల్లో జాప్యం కారణంగా నగరవాసులు అవస్థలుపడాల్సి వచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు. వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.