Heavy Rain | మహానగరంపై మబ్బు దుప్పటి కమ్ముకున్నది. బంగాళాఖాతంతో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం సైతం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. జనజీవనం స్తంభించింది. వరద పోటెత్తడంతో అల్లాపూర్, కూకట్పల్లి ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై…20 ఇండ్లు నీటమునిగాయి. సహాయక చర్యల్లో ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, గంటలు గడిచినా.. పునరుద్ధరించకపోవడంతో పలు చోట్ల అంధకారం అలుముకున్నది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 610 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా.. ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అత్యవసరమైతే తప్ప..నగర ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు హుస్సేన్‌సాగర్, జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి నిల్వలను ఎప్పుటికప్పుడు అంచనా వేస్తూ..పరీవాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ )
ఉప్పొంగుతున్న చెరువులు
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉండగా, 28 నిండుకుండలా మారి అలుగు పారుతున్నాయి. స్లూయిస్ గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ నాలాల్లోకి వరద నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల దిగువ ప్రాంతంలో ఉన్న వారికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం తలెత్తకుండా జీహెచ్ఎంసీ లేక్ విభాగం అప్రమత్తమైంది. సర్ప్లస్ చెరువుల వద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, న్యాక్ ఇంజినీర్లు, సూపర్వైజర్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతున్నదని, ప్రస్తుతం 10, 400 క్యూసెక్కుల నీరును కిందకు వదలుతున్నామని అధికారులు తెలిపారు.
అధికారులకు సెలవులు రద్దు
బల్దియా కమిషనర్ ఆమ్రపాలి
భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (సంపు) నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని, అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు, కంపౌండ్ వాల్స్, భవన నిర్మాణ ప్రదేశాలను డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు సందర్శించి ప్రమాద అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులకు సెలవులను రద్దు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను వచ్చే ఏడాదిలో 50కి తగ్గేలా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడండి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్
Hyd3
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ పరిధిలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులు ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. హిమాయత్‌సాగర్, గండిపేట, హుస్సేన్‌సాగర్ నీటి మట్టాలను గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, హెచ్ఎండీఏకు చెందిన మొత్తం 610 అధికారిక బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. బిల్డింగ్ కార్మికులను సురక్షితమైన చోటుకు తరలించాలని దానకిశోర్ సూచించారు. వర్షాల కారణంగా భవన నిర్మాణాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కెడ్రాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ కార్మికులను సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కెడ్రాయ్లో సభ్యులుగా ఉన్న బిల్డర్లు, డెవలపర్లకు సూచించామన్నారు.
గ్రేటర్లో అంధకారం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. క్షేత్ర స్థాయిలో మరమ్మతులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సైబర్‌సిటీ సర్కిల్, హబ్సిగూడ, మేడ్చల్, సరూర్‌నగర్ సరిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినా..వారు నిర్లక్ష్యం చేయడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కిస్మత్పూర్ ఫీడర్ పరిధిలో ఒక ఫేజ్ సరఫరా నిలిచిపోగా, పునరుద్ధరణకు 3 గంటలు పట్టడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కరెంటు సరఫరా లేదని విద్యుత్ శాఖ సెక్షన్ అధికారులకు, ప్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా.. వెంటనే స్పందించలేదు. మియాపూర్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. అలాగే గ్రేటర్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో నగర వాసులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో భారీ చెట్టు కూలడంతో కరెంటు నిలిచిపోయింది. విద్యుత్, బల్దియా బృందాలు చెట్టు కొమ్మలను తొలగించి, కరెంటు తీగలను సరిచేసి సరఫరాను పునరుద్ధరించారు. అలాగే పికెట్‌లోని లక్మీనగర్, ఎంఈఎస్ కాలనీల్లో ఉదయం 8 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓల్డ్ కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని సరస్వతి స్కూల్ వెనకవైపు చెట్టు కరెంటు స్తంభంపై పడటంతో సరఫరాకు ఆటంకం కలిగింది.
సమస్యలుంటే.. 040-2320 2813, 90634 23979
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర భవనాల్లో ఉంటున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జియాగూడ మండి పక్కన మూసీ వరద నీటి ప్రవాహ వేగాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంత ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 040-2320 2813, 90634 23979కు సమస్యలను తెలియజేయాలని, ఫోన్‌కాల్స్‌పై సత్వరమే స్పందించాలని అధికారులకు సూచించారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కూడా రద్దు చేసినట్లు చెప్పారు.