హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లిలో వర్షం పడుతున్నది. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయంలో వాన కురుస్తుండటంతో ప్రజలు అవస్తలు ఎదుర్కొంటున్నారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ముసురు కురుస్తున్నది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. దక్షిణ తెలంగాణలో జల్లులు కురిసే అవకాశం ఉంది.