Heavy Rain | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ఈదురుగాలులకు వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, బీఎన్ రెడ్డి నగర్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. ఈ భారీ వర్షం మరింత కష్టాన్ని తెచ్చిపెట్టింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాబోయే రెండు గంటల్లో వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.