సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నాం.. ప్రయోగాత్మకంగా చేపట్టిన సచివాలయం, రాజ్‌భవన్, సోమాజిగూడ మెర్క్యూర్ హోటల్ సమీపంలో భూ గర్భ సంపులు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా ప్రకటించుకున్నా జీహెచ్ఎంసీ.. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ పని రాకుండా పోయాయి. భారీగా వరద నీరు నిలిచిపోయి భారీ గా ట్రాఫిక్ జాం నెలకొంది. దీనిక్కారణం భూగర్భ సంపుల నుంచి రాజ్‌భవన్ వైపు నీరు సాఫీగా వెళ్లలేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సచివాలయం సాక్షిగా వరద నీరు నిలిచిపోయింది. చెరువును తలపించింది. రాజ్‌భవన్, సోమాజిగూడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భూ గర్భ సంపులు సైతం వాన కష్టాలను తీర్చలేకపోయాయని అటుగా వెళ్లే వాహనదారులు మండిపడ్డారు.
వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలుస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంచనా వేసిన అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్ల శాశ్వత నివారణకుగానూ ప్రభుత్వం వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్లను చేపట్టింది. రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను రానున్న రెండు సంవత్సరాలలో చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కొక్కటీ రెండు లక్షల లీటర్ల నుంచి 10.4 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్లను రూ. 15.09 కోట్ల వ్యయంతో 14 నిర్మాణ పనులను చేపట్టగా 11 చోట్ల అందుబాటులోకి తీసుకువచ్చారు.
వర్షం కురిసినప్పుడల్లా వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని, వాటర్ లాగింగ్ కాకుండా చర్యలు చేపడుతామని జీహెచ్ఎంసీ రోటీన్ డైలాగ్‌లు గురువారం కురిసిన వర్షానికి ఏ మాత్రం పనిచేయలేదని చెప్పవచ్చు. సిటీలో నిత్యం రద్ధీగా ఉండే అమీర్‌పేట, లక్డీకపూల్, పంజాగ్టు, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, బషీర్‌బాగ్ చౌరస్తా, పబ్లిక్ గార్డెన్స్ ముందున్న సీసీఎస్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. కాగా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, హైడ్రా బృందాలు వర్షం కురుస్తున్న సమయంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.