జూబ్లీహిల్స్, మార్చి 4: హైదరాబాద్‌లో రోజురోజుకు ఎండల తీవ్రత (Summer) పెరుగుతున్నది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని శ్రీరామ్ నగర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్సీలలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మండుతున్న ఎండలకు ముందస్తు జాగ్రత్తలే ముఖ్యమని భావించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సమ్మర్ స్ట్రోక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేసవిలో ఎండల వేడిమిని తట్టుకునెందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో జనసమ్మర్ధం ఉండే ప్రాంతాలలో తాగునీరు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవడంతో పాటు సన్‌స్ట్రోక్‌కు గురయ్యే వారిని కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రోజువారీ పనుల కోసం లేబర్ అడ్డాలలో వేచి వుండే కార్మికులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మార్చి నుంచి జూన్ నెలాఖరు వరకు భవన నిర్మాణ పనులు మధ్యాహ్నం పూట చేయకూడదని ఆయా అడ్డాలలో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా లేబర్ అడ్డాలతో పాటు బస్ స్టాప్‌లు, పోలీస్ స్టేషన్లు, కూడళ్లలో ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామ్ నగర్ ఎస్పీహెచ్ఓ బీ.విజయ నిర్మల తెలిపారు. జూబ్లీహిల్స్ పీ హెచ్ సీ పరిధిలో 13, శ్రీరామ్ నగర్ లో 40, వినాయక్ నగర్ 26, బోరబండలో 59 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సమ్మర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు చర్యలు తీసుకంటున్నారు.
శ్రీరామ్‌నగర్‌లో..
భవన నిర్మాణ ప్రాంతాలు- 20
లేబర్ అడ్డా లు- 2
అంగన్వాడి సెంటర్ లు- 87
మార్కెట్లు- 14
మసీదులు- 20
మందిరాలు- 19
మదర్సాలు-7
గుడిసె ప్రాంతాలు- 3