ఖైరతాబాద్, నవంబర్ 5 : గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల పాలవుతున్నా వారి గోస పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన ఎనిమిదో తరగతి చదువుతున్న మహాలక్ష్మి, తొమ్మిదో తరగతి చదువుతున్న జ్యోతి, శైలజను నిమ్స్ దవాఖానలో చేర్చారు. మహాలక్ష్మి కోలుకోగా, జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
శైలజ వెంటిలేటర్‌పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ… గురుకుల పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య దొరుకుతుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చేర్పిస్తారని, కానీ పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టేలా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారాయని ఆరోపించారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే సాక్ష్యమన్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, సుమారు 600 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని తెలిపారు. ఆ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని అనడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ఈ మరణాలపై ప్రభుత్వానికి సోయి లేదని, వాటిపై ఏ స్థాయిలోనూ సమీక్షలు నిర్వహించలేదని చెప్పారు. ఇటీవల మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరెంటు షాక్ తగిలి ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా దున్నపోతు మీద వానపడినట్లే ఉందని విమర్శించారు. కేసీఆర్ గురుకులాలను ఎవరెస్టు స్థాయికి పెంచితే, రేవంత్ రెడ్డి విద్యార్థులను ఎలుకలు, పాములు కరిచే స్థాయికి తీసుకెళ్లారని దుయ్యబట్టారు.
చలికాలంలో విద్యార్థులకు ముందు రగ్గులు అందించు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురకలు వేశారు. గురుకులాలను సమీక్షించేందుకు గతంలో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేదని, ఇప్పుడు అలాంటి పద్ధతులు ఏమీ లేవన్నారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌కు ఒక హెల్త్ సూపర్వైజర్ ఉండాలని, విద్యార్థులు జబ్బు పడితే కనీసం మందులు కూడా అందుబాటులో లేవని చెప్పారు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం బెడ్లు లేవని, కింద పడుకోవడం వల్ల పాముకాట్లకు గురవుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి గురుకులాలపై సదాభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని, వాటిని మూసివేసేందుకు కుట్ర జేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, బేషజాలకు పోకుండా గురుకులాలకు ఉన్న పేరును పాడు చేయొద్దని హితవు పలికారు.
హరీశ్‌రావు రాకతో.. నిమ్స్‌కు మంత్రుల పరుగులు
ఫుడ్‌పాయిజన్‌కు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు వచ్చారన్న విషయం తెలుసుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ నిమ్స్ దవాఖానకు పరుగులు పెట్టారు. ఆస్పత్రిలో హడావిడి చేశారు. విద్యార్థులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డైరెక్టర్ డాక్టర్ బీరప్పను కోరారు.