22ఏ సంకెళ్లు తెంచి ప్రజల ఆస్తులకు విముక్తి కల్పించాలని గులాబీ దళం గర్జించింది. నిషేధిత జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గుర్తిచేస్తుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నగరంలో లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజల ఆస్తులతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22ఏ నిషేధిత జాబితా పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు, స్థలాలు నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పభుత్వం వెంటనే స్పందించకపోతే బాధితులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మల్కాజిగిరి లోని వాజ్‌పేయినగర్‌లో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని గళమెత్తారు.
-మల్కాజిగిరి/ నేరెడ్మెట్ , ఆగస్టు 18
మల్కాజిగిరి/ నేరెడ్మెట్ , ఆగస్టు 18: 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చి వాటి క్రయవిక్రయాలకు అడ్డంకులు సృష్టించడం దారుణమని మండిపడ్డారు. 22ఏ సంకెళ్ల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని వాజ్‌పేయినగర్‌లో 22ఏ నిషేధిత జాబితా సమస్యపై నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. 22ఏ నిషేధిత జాబితా విషయంలో పరిస్థితి పిచ్చొళ్ల చేతిలో రాయి అన్నట్లుగా ఉందన్నారు. హైదరాబాద్‌లో లక్షలాది కుటుంబాలు 22ఏ నిషేధిత జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 22ఏ జాబితాలో ఉన్న స్థలాల యజమానులు రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్లాలని అక్కడికి వెళ్తే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లమని అక్కడికి వెళ్తే కలెక్టర్ దగ్గరకి వెళ్లమని చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజలు తమ ఆస్తులను విక్రయించలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2008లో కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్‌సీ ను రద్దు చేసిన తర్వాత ప్రజలు అనేక ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారని హరీశ్‌రావు చెప్పారు. ఏళ్ల తరబడి ప్రజల ఆధీనంలోఉన్న భూములను ఇప్పుడు నిషేధిత జాబితాల్లో చేర్చడం వల్ల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో భూములు ఆస్తులు నిషేధిత జాబితాల్లోకి వెళ్లాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు వంటి పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వ కాలంలో అమలైన సంక్షేమ పథకానలు కొనసాగించాలన్నారు.
22ఏ నిషేధిత జాబితా కారణంగా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న ప్రతి సర్వే నంబర్‌ను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిని స్పష్టంగా వేరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రజలు తమ ఆస్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, 22ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసే వరకు ప్రజల తరపున తమ పోరాటం కొరసాగుతుందన్నారు. మల్కాజిగిరి ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
22ఏ నిషేధిత జాబాతాపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సమీక్ష నిర్వహించి అర్హత ఉన్న ఆస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ బాధిత ప్రజలు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగించి ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. 22ఏ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, 22ఏ నిషేధిత ప్రాంతాల కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పిచ్చోడి చేతిలో రాళ్లలా తయారైందని ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రావణ్ విమర్చించారు. 22ఏ నిషేధిత జాబితా వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వారి ఆస్తులపైనే ఆంక్షలు విధిస్తోందన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నవారు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు జీవితకాలం కూడబెట్టుకున్న డబ్బుతో కొనగోలు చేసిన స్థలాలు, నిర్మించుకున్న ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల వారి ఆస్తి విలువ ఉన్న అవసరానికి ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
మల్కాజిగిరి ఒక్కటేకాదు..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 22ఏ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలని, ప్రజల ఆస్తులను రక్షించలేని ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22ఏ జాబాతాలో ఉన్న ఆస్తులు ప్రభుత్వ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.