అమీర్‌పేట్, నవంబర్ 9: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు కేవలం జూబ్లీహిల్స్‌కే కాదు.. రాష్ర్టానికే మేలు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరుచుకొని ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పారు. ప్రచారంలో చివరి రోజైన ఆదివారం ఉదయం ఎర్రగడ్డలోని వాసవి బృందావనం గేటెడ్ కమ్యూనిటీవాసులతో అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి హరీశ్‌రావు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మంచి అభ్యర్థే లేరన్నట్టు ఓ రౌడీ కుటుంబానికి టికెట్ కట్టబెట్టారని విమర్శించారు. అభ్యర్థి కుటుంబ సభ్యులను బైండోవర్ చేసినప్పుడు అలాంటి వారిని రౌడీ అని పిలువకపోతే మరేమని పిలుస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికను ఓ ఆడబిడ్డకు.. ఓ రౌడీకి మధ్య జరుగుతున్న పోటీగా చూడాలన్నారు. సునీతమ్మ ఒక్కరు కాదని ఆమె వెంట కేసీఆర్, మొత్తం బీఆర్ఎస్ పార్టీనే ఉన్నదని నియోజకవర్గంలోని అన్ని వర్గాల గుండెల్లో మాగంటి శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.
ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా సునీతమ్మ వెంటే తాము అంటూ ఓటర్లు మద్దతు తెలుపుతున్నారని వివరించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. అలాంటి కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో నాంది పలకాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వాసవి బృందావన్ నివాసితులు కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములై మాగంటి సునీతమ్మకు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.