బంజారాహిల్స్: రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంతో పాటు దేశం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదన్నారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారని, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లిష్ మీడియం విద్య అందించారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మైనార్టీ సబ్ ప్లాన్ ఇస్తాం…నాలుగు వేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తాం… ఇమామ్, మౌజన్లకు రూ. 5,000 నుంచి రూ.12 వేలకు పెంచుతామని చెప్పిందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలని కోరారు.
18 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం నేర్పించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో త్వరలో ఉప ఎన్నిక రానుందని, పదేండ్లలో మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన సాయం గత ఐదు దశాబ్దాల్లో ఎవరూ చేయలేదని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎంతో బాగా పనిచేశారని, బీఆర్ఎస్ సీటైన జూబ్లీహిల్స్‌ను తిరిగి గెలుచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
కాంగ్రెస్ పాలనతో ప్రజలంతా బాధలు పడుతున్నారని, ఉపాధి కోల్పోయారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చేశారన్నారు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికలో గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నేత సర్దార్‌ను ఏడాదిన్నర పాటు అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి, ఆయని ఇంటిని కూల్చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మరోసారి బీఆర్ఎస్ జెండాను జూబ్లీహిల్స్ గడ్డమీద ఎగురవేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్లి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం సాధించేలా పనిచేద్దామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారులను సైతం కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ఢిల్లీదాకా చాటి చెప్పాలన్నారు. డివిజన్ వారీగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇన్చార్జీలను నియమించుకోవాలని, ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌పార్టీ నేతల అరాచకాలను, మోసాలను వివరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధ్దన్‌రెడ్డి, మైనార్టీ నేత సొహైల్ తదితరులు పాల్గొన్నారు.