సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): మహానగరంలో మంచి నీరు తాగలేని విధంగా గరళంగా మారుతున్నది. ఇండ్ల నుంచి వచ్చే గృహ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోతున్నది. మహా నగరంలోని భూగర్భజలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇండ్లలోని బోర్లలో పుషలంగా నీళ్లున్నా తాగడానికి, అవసరాలకు వాడుకునేందుకు అనుకూలంగా లేకుండా తయారవుతున్నాయి.
పారిశ్రామికవాడలు, మురికివాడలు, బస్తీల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఆయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైన లెడ్, కాడ్మియం, నికెల్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్(టీడీఆర్), క్లోరైడ్, ఎలక్ట్రికల్ కండక్టవిటీ, ప్రమాదకర రసాయనాలు, హానికర లోహాలతో నిండిపోయింది. భూగర్భ జలాల పీహెచ్ విలువ మరింత పెరిగింది. భూగర్భ జలాల్లోకి విచ్చలవిడిగా వదులుతున్న పారిశ్రామిక వ్యర్థాల వల్ల నగరంలోని నీరు తాగడానికి పనికిరాకుండా పోయింది. కాలుష్య నియంత్రణ మండలి పరీక్షల ద్వారా ఈ భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి. పరిశ్రమలపై పీసీబీ ఎంత నిఘా ఉంచినా అక్రమార్కులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలతో పాటు భూమిలోకి వదులుతున్నారు. వీరి వికృత చేష్టల వల్ల భవిష్యత్తు తరాలు హైదరాబాద్ నీటిని తాగలేని దుస్థితి ఏర్పడుతున్నది.
తెలంగాణలో నాలుగువేలకు పైగా రెడ్ కేటగిరీ (17వ కేటగిరీ) పరిశ్రమలు ఉంటే అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మూడొంతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ కంపెనీల నుంచి వెలువడే కలుషిత జలాలను సాధారణంగా ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేస్తారు. కానీ పరిశ్రమల యజమానులు కలుషిత జలాలను గుట్టు చప్పుడు కాకుండా మురుగు కాల్వలు, చెరవులు, నాలాల్లోకి వదులుతున్నారు. వారి దుశ్చర్యల వల్ల భూగర్భ జలాలన్నీ విషతుల్యం అవుతున్నాయి.
ఈ వ్యవహారం ఎక్కువగా పారిశ్రామిక వాడలైన పటాన్చెరు, ఈసీఐఎల్, బొల్లారం, పాశమైలారం, అమీన్పూర్, బాలానగర్, కాటేదాన్, చర్లపల్లి, మలాజిగిరి ప్రాంతాల్లో జరుగుతున్నది. ఆయా ప్రాంతాల్లో దుర్వాసన వస్తున్నదని ప్రజలు వందల సార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు నిబంధనలు పాటిస్తున్న పరిశ్రమల యజమానులు ఆ తర్వాత కుక్కతోక వంకర అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా వారిచేసిన తనిఖీలు ప్రజలకు తెలిసేలా చేయకపోవడం వల్ల పరిశ్రమల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కిలో మీటర్ల మేర భూగర్భ జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. పారిశ్రామిక వర్థ జలాలలను కంపెనీలు బహిరంగంగా పారబోస్తున్నా పీసీబీ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలపై నిఘా కొరవడిందని మండిపడుతున్నారు.
మనం నిత్యం తాగే మంచినీటిలో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఆర్ ) శాతం 500 నుంచి 2 వేలలోపు ఉండొచ్చు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పారిశ్రామిక వాడలు, మురికి వాడల్లో దీని తీవ్రత 9 వేల వరకు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సీఏసీఓ3, ఎలక్ట్రికల్ కండక్టవిటీ 200 నుంచి 600 వరకు ఉండొచ్చు. కానీ అది 13 వేలు వరకు నమోదవుతున్నది. క్లోరైడ్, నికెల్, కాడ్మియం, ఇతర లోహాలు కూడా భూగర్భ జలాల్లలో ఉండాల్సిన దానికంటే ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పీసీబీ పరీక్షల్లో తేలినట్లు సమాచారం.
టీడీఆర్, నికెల్, కాడ్మియం, లెడ్ సహా ఇతర లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలను తాగునీటి అవసరాలకు వినియోగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం మరింత విస్తరించనున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కాలుష్య తీవ్రత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో నివసించడం సాధ్యం కాకుండా మారే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి కాలుష్య కారకాలను అరికట్టాలని సూచిస్తున్నారు.