Dengue Fever | సిటీబ్యూరో: ‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’… ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులు, డెంగీ బాధితులే ఉండటంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రైవేటులోనూ బెడ్లు దొరకడం లేదు. దీంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు తలపిస్తున్నాయి. ఎక్కువగా వైరల్ ఫీవర్, డెంగీ కేసులే వస్తున్నట్లు ప్రైవేటు దవాఖానల వైద్యులు చెబుతున్నారు.
విజృంభిస్తున్న డెంగీ
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సైతం వైరల్, డెంగీ రోగులతో నిండిపోయింది. మొన్నటి వరకు 500నుంచి 800వరకు ఉన్న రోజువారీ ఓపీ ప్రస్తుతం వెయ్యి దాటుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. జూలై, ఆగస్టు నెలల్లోనే ఇప్పటి వరకు 714 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది.