HMDA | సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది. ఏఐ ఆధారిత వ్యవస్థతో వేగంగా భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సంస్కరణలు చేసిన ప్రభుత్వం.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. చకచకా అనుమతులు దేవుడెరుగు కనీసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటే చాలనే పరిస్థితి హెచ్ఎండీఏ పరిధిలో నెలకొని ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను ఆన్లైన్లోనే వేగంగా పూర్తి చేసేలా టీఎస్ బీపాస్ తీసుకువచ్చి.. సమర్థవంతంగా అమలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఎస్ బీపాస్ లోపభూయిష్టంగా ఉందని, మరింత పారదర్శకత, వేగవంతమైన అనుమతుల కోసం బిల్డ్ నౌ ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త విధానం పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండానే, పాత విధానాన్ని నిలిపివేయడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఏప్రిల్ మొదటివారంలోనే బిల్డ్ నౌ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. కానీ అప్లికేషన్ పనితీరులో వస్తున్న లోపాలను సవరించడానికే సమయం పడుతోంది. దీంతోనే అప్లికేషన్ అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్నా…ఇందులో వస్తున్న షార్ట్ ఫాల్స్, సెక్యూరిటీ, పనితీరులోని లోపాలను సవరిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో అప్లికేషన్ సిద్ధం కాకుండానే అమలు చేస్తే వచ్చే ఇబ్బందులతో మరిన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదు. కనీసం సిబ్బందికి పనితీరుకు శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.