సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ): రేవంత్ సర్కార్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ జేఏసీ ఉపాధ్యాయులు హెచ్చరించారు. నగరంలో తార్నాక, కోఠిలోని పదో తరగతి మూల్యంకన కేంద్రాల్లో మంగళవారం ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గతేడాది మూల్యాంకన బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న స్పాట్ రేట్లను మరో 50శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది బకాయిలను సైతం వెంటనే చెల్లించాలని కోరారు. 2024లో చేసిన కులగణన సర్వేకు సంబంధించిన పారితోషికాన్ని ఇంకా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పీఆర్సీ, డీఏ, ఈహెచ్ఎస్ సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో జేఏసీ పిలుపుతో హైదరాబాద్ జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక సీఎం ప్రైవేట్ పాఠశాల ప్రారంభానికి హాజరై ప్రభుత్వ టీచర్లను అవమానపరచేలా వ్యాఖ్యలు చేయడం సరైందని కాదని అన్నారు. కార్పొరేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం విచారకరమని విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అభ్యసనా సామర్థ్యాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని సర్వేలలో తేటతెల్లమైందని చెప్పారు. ఈ విషయాన్ని విస్మరించి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసనా సామర్థ్యాలు లోపించాయని మాట్లాడటం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి దోహదం చేస్తాయని మండిపడ్డారు. 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని వాగ్దానం చేసి అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో అన్ని సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర బాధ్యులు, జిల్లా, మండల నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.