సికింద్రాబాద్: అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమపథకాలను తెలంగాణప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీస్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకోసం అనేక పథకాలను రూపొందించిందని తెలిపారు. సీతాఫల్‌మండిలోని క్యాంపు కార్యాలయంలో రూ. 1కోటీ15 లక్షల విలువచేసే 30 కల్యాణలక్ష్మీ, 59 షాదీముబారక్ చెక్కులను, రూ.26 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల వివాహాలు తల్లితండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు చేసి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు సీఎంఆర్ఎఫ్ను సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్దయెత్తున అమలు జరుపుతున్నామని చెప్పారు.
రానున్న రోజులలో అర్హులైన వారందరికి తెల్లరేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందజేసే పథకాల లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలని, ఎవ్వరికి చిల్లిగవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా ఇందుకోసం డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్, మారేడ్‌పల్లి తాసిల్దార్లు జానకీ, సునీల్‌కుమార్, కార్పొరేటర్లు, నేతలు కిషోర్ గౌడ్, కిరణ్‌కుమార్ గౌడ్, రామేశ్వర్‌గౌడ్, సత్యనారాయణ గౌడ్, మల్లూరి అనీల్, బొగ్గుల కృష్ణ, బాల్‌రాజ్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.