Medchal Metro | సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీ మెట్రో నిర్మాణానికి ఇన్నాళ్లు సాగిన ప్రజా పోరాటానికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు ఫేస్-2లోనే నార్త్ సిటీ మెట్రో నిర్మిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూపొందించిన డీపీఆర్‌కు అనుబంధ డీపీఆర్‌ను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను సీఎం ఆదేశించారు. నార్త్ సిటీలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం నగరానికి వచ్చిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాలు లేకుండా ఫేస్-2 కింద ప్రాజెక్టు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఏడాది కాలంగా తమ ప్రాంతానికి మెట్రో నిర్మాణం చేయాల్సిందేనంటూ నార్త్ సిటీ వాసులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. ఇంటింటికీ మెట్రో సాధన పేరిట మేడ్చల్ మేట్రో సాధన సమితి ఆధ్వర్యంలో తమ ప్రాంతానికి మెట్రో ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు. దీంతో ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలను గుర్తించి మెట్రో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో ఫేస్-2బీ డీపీఆర్‌ను మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రజా పోరాటాలకు..
ప్రజా పోరాటాలకు ప్రభుత్వం మరోసారి తలొగ్గింది. కాగితాలకే పరిమితమైన ఫోర్త్ సిటీకి మెట్రో నిర్మిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో… నార్త్ సిటీ వాసులు ఆందోళన చెందారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తూ, 30లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతాలకు మెట్రో విస్తరించకుండా… జనసంచారమే లేని ప్రాంతాలకు మెట్రో లైన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ….. పార్టీలకు అతీతంగా చేసిన ప్రజా పోరాటాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమానికి అనుగుణంగా… ఈ ప్రాంతానికి మెట్రో విస్తరించే ప్రణాళికలు రూపొందించింది.
నార్త్ సిటీ మెట్రో సాధన ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’..
నార్త్ సిటీకి మెట్రోను విస్తరించాలని ప్రజా ఆకాంక్షలుగా అనుగుణంగా ప్రజా ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’ కూడా తన వంతు పాత్రను పోషించింది. ఈ క్రమంలో గతేడాది మార్చి నెల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సమయంలోనే మెట్రో నిర్మాణంపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో..‘ఎలివేటెడ్ కారిడార్‌లో మెట్రో గల్లంతు’, మెట్రో లేని ఉత్తర నగరం, నార్త్ సిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండానే ఫేస్-2 డీపీఆర్ రూపకల్పన జరుగుతున్న సమయంలో ‘నార్త్ సిటీకి మెట్రో లేనట్టేనా?’ ‘నార్త్ సిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి’ మెట్రో సాధన కోసం మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యక్రమాలు, డబుల్ డెక్కర్ లేకుండానే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయాలంటూ ప్రభుత్వం చేసిన సూచనలను ఎండగడుతూ.. మెట్రో సాధన కోసం వరుసగా కథనాలను ‘నమస్తే’ ప్రచురించింది.
మెట్రో సాధనలో కీలకంగా..
నార్త్ సిటీ మెట్రో సాధనలో మేడ్చల్ మెట్రో సాధన సమితి, బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. గేట్ వే ఆఫ్ నార్త్ తెలంగాణగా పిలిచే ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దేలా ఐటీ పార్కులు, ఇండస్ట్రీయల్ కారిడార్లతోపాటు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా మాజీ సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఐటీ పార్క్ డెవలప్మెంట్కు ప్రణాళికలను అమలు చేసింది. అదే విధంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి, బల్దియాలో కంటోన్మెంట్ విలీనంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.
రక్షణ శాఖ భూములను రాష్ర్టానికి కేటాయించాలని ప్రతిపాదించింది. పెండింగ్‌లో ఉన్న కేటాయింపుల ప్రక్రియ ముందుకు కదలడంతో… నార్త్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏడాది కిందట కాంగ్రెస్ సర్కారు శంకుస్థాపన చేసింది. తాను ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాననంటూ సీఎం రేవంత్‌రెడ్డి అనేక సార్లు ప్రకటించారు. కానీ ఇటీవల ఫేజ్-2 విస్తరణ ప్రణాళికల్లో ఆ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఆ ప్రాంత వాసుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. నార్త్ సిటీ మెట్రోకు సానుకూలంగా స్పందించడంతో ఆ ప్రాంత వాసుల కోరిక నెరవేరింది.
ఫేస్-2బీగా నిర్మాణం…
ప్యారడైజ్ నుంచి మేడ్చల్(23 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట (22 కి.మీలు) మేర మెట్రో కారిడార్‌ను ఫేస్-2లోనే నిర్మించనున్నారు. పార్ట్-బీగా వచ్చే ఈ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసిన ప్రభుత్వానికి అందజేయాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సిందిగా మెట్రో ఎండీని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలను తొలగించేలా ప్రాజెక్టు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేయాలని సర్కారు ఆదేశించింది. అయితే నార్త్ సిటీ మెట్రో నిర్మాణం కూడా ఫోర్త్ సిటీ మెట్రో అలైన్మెంట్తో కలిపి నిర్మించనున్నారు. ప్రస్తుతం ఒక కిలోమీటర్‌కు రూ. 318 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టనుండగా, ప్రస్తుతం 45 కిలోమీటర్ల ప్రాజెక్టుకు అదనంగా మరో 14310 వేల కోట్లు అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
మెట్రో మార్గమిదే..
ప్యారడైజ్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి తాడ్బంద్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అదేవిధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మేర రూట్ మ్యాప్ ఉండాలని అందుకు అవసరమైన డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రో ఎండీని ఆదేశించారు.