సిటీబ్యూరో: మెరుగైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిత్యం లక్షన్నర మంది నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి రాకపోకలు సాగిస్తున్నా… ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున్నది. గడిచిన కొంత కాలంగా తమ ప్రాంతానికి మెట్రో రైలు అందుబాటులోకి తీసుకురావాలంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నా… సర్కారు పట్టించుకోవడం లేదు.
జనాలే లేని ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్రెడ్డి మెట్రో రైలును తీసుకెళ్తున్నారు. కానీ నిత్యం లక్షన్నర మంది రాకపోకలు సాగించే నార్త్ సిటీ విషయాన్ని మాత్రం పట్టించుకోవడమే లేదు. ఇదే ఇప్పుడు నార్త్ సిటీ ప్రాంత వాసుల ఆందోళనకు కారణమవుతున్నది. రెండు ఎలివేటెడ్ కారిడార్లకు నార్త్ సిటీలో తొలిసారి అడుగు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుట నిరసన గళం విప్పిన స్థానికులు.. అప్పటినుంచి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా ప్రయోజనాలను మరిచి, స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో నిర్మాణం చేయాలంటూ కొంతకాలంగా ఆన్లైన్ పిటిషన్ పేరిట మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆందోళన చేస్తున్నది. స్థానికులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ ప్రాంత దశను తిరగరాసే మెట్రో నిర్మాణం చేపట్టాలంటూ పెద్ద ఎత్తున్న స్థానికులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఓ దఫా మెట్రో నిర్మాణం కోసం పార్కులు, కాలేజీలు, పాఠశాలలు, ఆఫీసులకు సమీపంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆన్లైన్ పిటిషన్ కార్యక్రమంలో స్థానికులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆన్లైన్ పిటిషన్లో అనూహ్య స్పందన వస్తున్నది.