HYDRAA | మేడ్చల్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హైడ్రాకు ప్రభుత్వ భూముల వివరాలను అందించేలా నివేదికలను సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను, నివేదికలను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 12 మండలాలు ఉండగా, స్థానిక తహసీల్దార్లు ప్రభుత్వ భూముల వివరాలను నమోదు చేసే పనిలో ఉన్నారు.
ఇప్పటికే కొన్ని మండలాల్లో సర్కారు భూముల వివరాలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి సమర్పించగా, మిగతా మండలాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు వచ్చిన వెంటనే నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రాకు సమర్పించనున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులు గుర్తించిన చెరువుల వివరాలను హైడ్రాకు సమర్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు.
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 5,120 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. బాలానగర్ మండలంలో 700 ఎకరాలు, శామీర్పేట మండలంలో 425, దుండిగల్ గండిమైసమ్మ మండలంలో 425, మేడిపల్లి మండలంలో 900, ఘట్కేసర్ మండలంలో 500, కాప్రా మండలంలో 400, కీసర మండలంలో 417, కుత్బుల్లాపూర్ మండలంలో 600, బాచుపల్లి మండలంలో 360, ఉప్పల్ మండలంలో 333, మల్కాజిగిరి మండలంలో 113, మేడ్చల్ మండలంలో 37 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు తెలుస్తున్నది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్ని స్థలాలు కబ్జాకు గురయ్యాయి. సంరక్షణలో ఎన్ని భూములు ఉన్నాయన్నది ప్రస్తుతం ప్రభుత్వ భూముల వివరాల సేకరణలో పూర్తిగా లెక్క తేలనున్నది. అయితే అనేక భూములు కబ్జాలకు గురైనట్లు అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ వివరాలను ఏ విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందిస్తారన్నది వేచి చూడాల్సిందే.