రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామంలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ భూములు అధికారుల ధనదాహానికి అన్యాక్రాంతమయ్యాయి. ఏకంగా సుమారు రూ. 600 కోట్ల విలువైన 188 ఎకరాలు పరులపరమయ్యాయి. పిగ్లీపూర్తో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు లంచాల మోజులో పడి రియల్టర్లు, రాజకీయ నాయకులకు అప్పనంగా పంచిపెట్టారు. నిషేధిత జాబితా భూములనూ రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడంతో కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇతరుల పరమవుతున్నాయి.
రంగారెడ్డి, జూలై 9 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ శివారుల్లోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే 188 ఎకరాలను అధికారులు ఇష్టానుసారంగా పరులపరం చేశారు. అధికారులు ముడుపులకు అలవాటు పడి ఈ భూములను రియల్టర్లకు, రాజకీయ నాయకులకు బదలాయించారు. ప్రస్తుత మార్కెట్లో ఈ భూముల విలువ సుమారు 500కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పిగ్లీపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 17/1/2/0లో 75 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమి ఉంది.
అలాగే, సర్వే నంబర్ 17/2లో 61ఎకరాల కారీజుఖాతా సర్కారీ భూమి ఉంది. సర్వేనంబర్ 17/3 నుంచి 17/18లో 53ఎకరాల సీలింగ్ సర్కారీ భూమి ఉంది. ఈ భూమితో పాటు 180 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ పట్టా భూమిని ఆసరాగా చేసుకుని అధికారులు సర్కారీ, భూదాన్, సీలింగ్ భూములపై కూడా రిజిస్ట్రేషన్లు జరిపారు. ఈ భూములు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్లందరూ కల్పవృక్షంగా భావించి రిజిస్ట్రేషన్లు చేశారు. పట్టా భూములు అడ్డం పెట్టుకుని ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో 188 ఎకరాలను గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు బదలాయించారు. ప్రస్తుతం ఈ భూమిని ఎవరికి వారే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
600 కోట్ల విలువైన భూములు..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 17లోగల సుమారు 600 కోట్ల విలువచేసే 188 ఎకరాల ప్రభుత్వ భూమి అధికారుల దనదాహానికి కర్పూరంలా కరిగిపోయింది. ఈ భూమి హైదరాబాద్, విజయవాడ రహదారికి అతిసమీపంలోని బాటసింగారం పండ్ల మార్కెట్ పక్కనే ఉంది. 75 ఎకరాల భూదాన్ భూమి, 61ఎకరాల ఖారీజుఖాతా సర్కారీ భూమి, 53 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఈ భూమికి ఎకరాకు బయటి మార్కెట్లో రెండు నుంచి మూడుకోట్ల ధర పలుకుతుంది. కానీ, ఈ భూమి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా వచ్చిన ప్రతి ఒక్కరూ పట్టా భూమి మాదిరిగా ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారు. తాజాగా ఇటీవల శంషాబాద్‌లో ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఓ తహసీల్దార్ కూడా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు 8ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయటం చర్చనీయాంశంగా మారింది.
అందినకాడికి దోచుకున్న అధికారులు..
పిగ్లీపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 17లో ఉన్న ప్రభుత్వ, సీలింగ్, భూధాన్ భూములను అధికారులు అందినకాడికి దోచుకుని ఇతరులకు కట్టబెట్టారు. ఈ బూమి విలువ ప్రస్తుత మార్కెట్లో ఐదువందల కోట్లకు పైగా ఉంటుంది. ఈ సర్వేనంబర్‌లో మొత్తం 386 ఎకరాలు ఉండగా….180 ఎకరాల పట్టా భూమిగా ఉంది. మరో 188 ఎకరాలు ప్రభుత్వ, భూదాన్, సీలింగ్ భూములున్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఎక్కడ ఖాళీ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా పనిచేసిన వారు ప్రతి ఒక్కరూ అందినకాడికి దోచుకుని రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం హుడా చైర్మన్‌గా ఉన్న వెంకట్‌రెడ్డి మాత్రం ఆ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో దూరంగా ఉన్నారు. దీంతో ఈ భూములు పూర్తిగా అధికారుల ధనదాహానికి కరిగిపోయాయని చెప్పటంలో సందేహం లేదు. తాజాగా, ఈ భూమిని కొత్తగా మరో రియల్టర్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నాడు. ఈ భూమి విషయంలో అధికారులు నోరు మెదపడంలేదు.
కోర్టుల ద్వారా అధికారులకు అడ్డుకట్ట
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులను ఆశ్రయించి భూముల వ్యవహారంలో తలదూర్చవద్దని అధికారులకు వ్యతిరేకంగా ఆర్డర్లు తీసుకువచ్చారు. దీంతో ఈ భూముల్లోకి అధికారులెవరూ రావద్దంటూ అడ్డుకట్ట వేసి రియల్టర్లు ఇష్టానుసారంగా భూములను పంచేస్తున్నారు. ఈభూముల వ్యవహారంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోవడం శోచనీయం.