ఖైరతాబాద్, మార్చి 22 : జ్ఞానాలకు నిలయాలు ఉన్న స్థలాల్లో ప్రకృతి సంపదపై బుల్డోజర్లను ప్రయోగించవద్దని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పూర్వ విప్లవ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం చేపట్టే విధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు హైకోర్టుకు కావాలని వంద ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లోరి 60 ఎకరాల్లో పది ఎకరాలు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం పెద్ద విషాదమన్నారు. విశ్వవిద్యాలయాలు అరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఉస్మానియా విద్యార్థులతో చర్చించి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, కవి, రచయిత నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిటీ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్లో ప్రస్తావించిన అంశాలన్నీ తప్పుల తడకలేనని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమి వేలం కోసం యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను కలిసినట్లు ప్రెస్‌నోట్ ద్వారా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అంటున్నారు.