Hyderabad | బండ్లగూడ, ఏప్రిల్ 15 : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రభుత్వ ఉద్యోగి రెచ్చిపోయాడు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
టోల్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్‌బండ్‌కు చెందిన హుస్సేన్ సిద్ధిక్ సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డుల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డుపైకి వచ్చాడు. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డు నెంబర్ 17 వద్ద ఎగ్జిట్ అవుతుండగా తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని అడిగాడు. ఇందుకు టోల్ సిబ్బంది అంగీకరించలేదు. మీకు టోల్ మినహాయింపు ఉండదని.. కచ్చితంగా టోల్ ఫీ చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో సిబ్బందిని పట్టించుకోకుండా హుస్సేన్ సిద్ధిక్ కారును పక్క నుంచి పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.
అది గమనించిన టోల్ సిబ్బంది.. సిద్దిక్ కారును ఆపారు. దీంతో ఆగ్రహించిన సిద్దిక్ కుటుంబసభ్యులు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.