మేడ్చల్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నాగారం, పోచారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవలే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పాలన గడువు ముగిసింది.
గడువు ముగిసిన తర్వాత స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నది. కాగా, ప్రత్యేక కమిటీ నివేదిక ఇచ్చేందుకు సుమారు 10 నెలలు పడుతుందని, అప్పటి వరకు జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనున్నది. ఈ క్రమంలో జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గం పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఇటీవలే మున్సిపాలిటీల్లో పాలక వర్గం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశాయి. ప్రారంభోత్సవాలు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేలా ఏ మేరకు చర్యలు తీసుకోనున్నారు అన్నది వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కాలేదని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆస్తిపన్నులు, ట్రెడ్ లైసెన్స్‌ల ఆదాయం పైనే ఆధారపడినట్లు మున్సిపల్ కమిషనర్ల ద్వారా తెలుస్తున్నది. ఆస్తిపన్నులను వంద శాతం వసూళ్లు చేసి మున్సిపాలిటీల్లో ఉండే సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. పాలక వర్గం లేకపోతే సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.