Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూబ్లీహిల్స్ లో మహిళలకు ఒక్కొక్కరికి 55,000 ఇచ్చి ఓటు అడుగు రేవంత్ రెడ్డి అని సూచించారు. బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు లక్ష్మీ, మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మీ, అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావ్ ఇవ్వకుండా మోసం చేశావని విమర్శించారు. ఒక అవ్వకు తాతకు 44,000 రేవంత్ రెడ్డి బాకీపడ్డాడని.. ఆ డబ్బు ఇచ్చాకే ఓటు అడగాలని సూచించారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేముందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతి బస్తీకి బస్తీ దవాఖాన పెట్టిండు.. హైదరాబాదులో 350 బస్తీ దవాఖానాలు పెట్టిండని గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చిన బస్తీ దవాఖానాలో కనీసం మందులు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీకి ఆస్పత్రికి పోతే డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటోలో ఇంటికాడ దిగబెట్టిండు అని అన్నారు. బతుకమ్మ చీరలు బందు. దళిత బంధు బందు. బీసీ బంధు బందు. మైనార్టీ బంధు బందు పెట్టిర్రని మండిపడ్డారు. కేసీఆర్ 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి నల్లా బిల్లు వసూలు చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ గరీబోళ్లకి నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. నల్లా సమస్యలు పెరిగినాయి. పైనుంచి నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ఓడిస్తేనే బుద్ధి వస్తుందని హరీశ్‌రావు అన్నారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీ రాహుల్ గాంధీతో చెప్పించారని.. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్తాకు లేరని మండిపడ్డారు.
చదువుకున్న పిల్లలను, అవ్వ తాతలను, నిరుద్యోగులను, మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేసిండని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటేస్తే పేదోళ్ల ఇల్లు కూలగొట్టినా నాకే ఓటేసిర్రు.. 4000 పెన్షన్ ఇవ్వకపోయినా నాకే ఓటేసిర్రు.. తులం బంగారం ఇవ్వకపోయినా నాకే ఓటేసిర్రు.. మహిళలకు 2500 ఇయ్యక పోయినా నాకే ఓటేసిర్రని అనుకుంటాడని హరీశ్‌రావు తెలిపారు.
తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే అని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని.. మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని తెలిపారు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్.. కేసీఆర్ కిట్టు తెచ్చింది కేసీఆర్.. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి అవ్వాతాతల గౌరవం పెంచిండు కేసీఆర్.. షీ టీమ్స్ తో ఆడపిల్లల భద్రత పెంచిండు కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ వి మొసలి కన్నీళ్లు, ఆపదమొక్కులు తప్ప ప్రజల సంక్షేమం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కి నిజాయితీ ఉంటే బాకీ కార్డు పంపిస్తాం. మీరు పడ్డ బాకీ ని చెల్లించి జూబ్లీహిల్స్ లో ఓటు అడగండని సూచించారు.