GHMC | హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అధికారుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. చందానగర్ సర్కిల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.56 లక్షలు కాజేసింది. ఈ విషయం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. సుభాషిణి అనే మహిళ శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. ట్రేడ్ లైసెన్స్, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను ఆమె జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిలో చాలావరకు డబ్బును సైడ్ చేసింది. అలా 2024-25వ ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూ.56లక్షలు కాజేసింది. ఆడిట్లో ఈ విషయం బయటపడింది.
ఆఫీసులో ఆడిట్ జరుగుతుందని తెలియడంతో సుభాషిణి విధులకు హాజరుకావడం మానేసింది. కానీ అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు సుభాషిణిని బలవంతంగా కార్యాలయానికి రప్పించారు. కాజేసిన డబ్బుపై ఆరా తీయగా సుభాషిణి నేరాన్ని ఒప్పుకుంది.