పైరవీలు జాన్తానై..అంటున్నారు బల్దియా కమిషనర్. జీహెచ్ఎంసీలో మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించిన కమిషనర్.. ఆ మేరకు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కమిటీని కూడా వేశారు. అయితే ఉన్న చోటే తిష్ట వేసేందుకు కొందరు అధికారులు మాత్రం.. తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధుల పైరవీ లెటర్లను తీసుకొస్తున్నారు. ఇలా ఓ అధికారి సిఫారసు లెటర్‌తో రాగా, ‘ఇంకోసారి పైరవీ అంటూ వస్తే.. నాన్ ఫోకల్కే పరిమితం చేస్తా’ అంటూ కమిషనర్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే నేడో.. రేపో.. బదిలీ ప్రక్రియ ముగియనున్నది.
GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో బదిలీల పైరవీల జాతర నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గత నెల 31తో ముగిసింది. ఇందులోభాగంగా బల్దియా నుంచి ఇతర పురపాలకలకు, వేరే మున్సిపాలిటీల నుంచి జీహెచ్ఎంసీకి ఉద్యోగులు బదిలీలపై వచ్చారు. ఆ సమయంలోనే అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమవ్వగా, మూడేండ్లకు పైబడిన ఉద్యోగులకు స్థానం చలనం కల్పించాలని కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయించి, ఆ మేరకు నలుగురు అదనపు కమిషనర్లతో బదిలీలు సజావుగా, పారదర్శకంగా జరిపేలా కమిటీ వేశారు.
అయితే ఏండ్ల తరబడి తిష్ట వేసిన కొందరు అధికారులు మాత్రం జీహెచ్ఎంసీలోనే తిరిగి కొనసాగేందుకు యత్నిస్తుండగా, మరికొందరు ఉద్యోగులు ముఖ్యమైన ప్రాంతాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో సిఫారసు లెటర్లతో పైరవీలకు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి వేరే మున్సిపాలిటీకి బదిలీ కాగా…పైరవీ లెటర్‌ను కమిషనర్‌కు ఇచ్చారు.
‘ఏదైన లెటర్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికే ఇవ్వండి..మీ బదిలీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది.. అక్కడే తేల్చుకోండి..ఇంకోసారి పైరవీ అంటూ వస్తే నాన్ ఫోకల్కే పరిమితం చేస్తా’ అంటూ కమిషనర్ ఆమ్రపాలి సదరు మహిళా ఉద్యోగిని హెచ్చరించారు. ఇక్కడ ఒక్క అధికారే కాదు.. టౌన్‌ప్లానింగ్, శానిటరీ విభాగం, హెల్త్ విభాగంలో కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లతో క్యూ కడుతున్నారు. రోజూ 20కి పైగా ఫోన్లు పైరవీలకు సంబంధించివే కమిషనర్‌కు వస్తున్నాయని, ఒకానొక దశలో కమిషనర్‌కు ఈ బదిలీల ప్రక్రియ తలపోటుగా మారిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ముగ్గురు మాత్రమే ..
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు కొందరు ఇతర పురపాలకల నుంచి జీహెచ్ఎంసీకి.. అటు నుంచి ఇతర మున్సిపాలిటీలకు బదిలీలు జరిగాయి. ఇందులోభాగంగా 11 మంది అధికారులు ట్రాన్స్ఫార్లు అవ్వగా, ఏడుగురు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, ఒకరు గ్రేడ్, ముగ్గురు గ్రేడ్-2 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు మాత్రమే బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లగా, మిగతా వారంతా జీహెచ్ఎంసీలోనే తిరిగి తిష్ట వేసేందుకు యత్నిస్తున్నారు.
‘కల్తీ’ నియంత్రణకు నిరంతరం తనిఖీలు
కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు చేసేలా ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ప్రతి వారం లక్ష్యాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెల్త్ అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. బుధవారం అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హోటల్, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాల్లో కల్తీ లేకుండా ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.
సమయపాలన పాటించని ఉద్యోగులపై మేయర్ ఆగ్రహం
సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తప్పవని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. సమయానికి విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యానికి ఎలాంటి సాకులు చెప్పవద్దని, ప్రతి ఉద్యోగి ఉదయం 10.30 గంటల లోపు విధులకు హాజరు కావాలన్నారు. 10.35 గంటలకు అన్ని విభాగాల నుంచి హాజరు రిజిస్టర్‌ను తన చాంబర్‌కు పంపించాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని అడ్మిన్ అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు.